ఎగుమతుల పెంపునకు ప్రోత్సాహకాలు ఇవ్వండి | Sakshi
Sakshi News home page

ఎగుమతుల పెంపునకు ప్రోత్సాహకాలు ఇవ్వండి

Published Tue, Dec 20 2022 5:32 AM

Exporters seek support measures in Budget to boost shipments - Sakshi

న్యూఢిల్లీ: ఎగుమతుల పెంపు లక్ష్యంగా రాబోయే 2023–24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో విద్యుత్‌ సుంకం మాఫీ, సులభతర రుణ లభ్యత వంటి సహాయక చర్యలను ప్రకటించాలని ఎగుమతిదారులు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎగుమతి చేసిన ఉత్పత్తులపై సుంకాలు, పన్నుల ఉపశమన (ఆర్‌ఓడీటీఈపీ) పథకం  రీయింబర్స్‌మెంట్‌ కోసం మాత్రమే కాకుండా, ఎగుమతుల పెంపు లక్ష్యంగా ఇతర కార్యక్రమాల కోసం కూడా తగిన నిధులను వాణిజ్య మంత్రిత్వశాఖకు ఆర్థికశాఖ అందజేయాలని ఎగుమతిదారులు కోరుతున్నారు.

ఆర్‌ఓడీటీఈపీ కింద వివిధ కేంద్ర– రాష్ట్ర సుంకాలు, ఇన్‌పుట్‌ ఉత్పత్తులపై  వసూలు చేసిన పన్నులు, లెవీలను తిరిగి ఆయా ఎగుమతిదారులకు చెల్లించడం జరుగుతుంది.  ఎగుమతులను పెంచడానికి, ఉద్యోగాలను సృష్టించడానికి కస్టమ్స్‌ సుంకాలలో కొన్ని మార్పులు, తగిన వడ్డీరేటులో రుణ లభ్యత అవసరమని ఈ రంగంలో నిపుణులు సూచిస్తున్నారు. భారత్‌ గత ఆర్థిక సంవత్సరం ఎగుమతుల విలువ 400 బిలియన్‌ డాలర్లు. 2022–23లో 450 బిలియన్‌ డాలర్ల లక్ష్యం. ప్రపంచ ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఈ లక్ష్య సాధనపై సందేహాలు నెలకొన్నాయి.  

ఎకానమీలో కీలకపాత్ర...
దేశ ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి ఎగుమతులు కీలకమైన చోదకమని,  ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను బడ్జెట్‌లో ప్రస్తావించాలని ముంబైకి చెందిన ఎగుమతిదారు, ది బాంబే టెక్స్‌టైల్‌ రీసెర్చ్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ ఎస్‌ కె సరాఫ్‌ పేర్కొన్నారు. ‘‘తమ ఉత్పత్తిలో 50 శాతానికి పైగా ఎగుమతి చేస్తున్న యూనిట్లకు విద్యుత్‌ సుంకాన్ని మినహాయించే విధానాన్ని బడ్జెట్‌ అందించాలి. ఉత్పత్తిలో 50 శాతానికి పైగా ఎగుమతి చేసే తయారీదారు ఎగుమతిదారులకు 2 శాతానికి సమానమైన పరిహారాన్ని మంజూరు చేయాలి. ఎగుమతిదారులు ఆర్థిక ఇబ్బందుల భర్తీకి ఇది దోహదపడుతుంది. ఈ పరిహారాన్ని ప్రోత్సాహకంగా పరిగణించకూడదు’’ అని సరాఫ్‌ సూచించారు.

ఎగుమతుల రంగం అధిక నాణ్యతతో కూడిన ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని పేర్కొన్నారు. సాంకేతికత, నాణ్యత స్పృహ, మౌలిక సదుపాయాల అభివృద్ధిని ఈ రంగం ప్రోత్సహిస్తోందని కూడా ఆయన అన్నారు. ‘భారత్‌ వస్తు, సేవల ఎగుమతులు 2021–22 ఆర్థిక సంవత్సరం జీడీపీలో 21.5 శాతంగా ఉన్నాయి. ఆసియాలోని చాలా అభివృద్ధి చెందుతున్న దేశాలలో నమోదవుతున్న 30 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఎగుమతుల సగటుతో పోలిస్తే ఇది చాలా తక్కువ. బ్యాంకింగ్, షిప్పింగ్, బీమా, టూరిజం వంటి అనేక రంగాల నుంచి సేవల పరమైన ఎగుమతులకు ప్రోత్సాహకాలు అవసరం’’  అని కూడా ఆయన ఈ సందర్భంగా విశ్లేషించారు.

కాగా, లూథియానాకు చెందిన హ్యాండ్‌ టూల్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ ఎస్‌సి రాల్హాన్‌ మాట్లాడుతూ, ఆధునిక మౌలిక సదుపాయాలతో సెక్టార్‌–నిర్దిష్ట క్లస్టర్‌లు లేదా పార్కులను ఏర్పాటు చేయడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ తగినన్ని నిధులను అందించాలని కోరారు. ఇది తయారీదారుల పోటీతత్వాన్ని పెంచడానికి సహాయపడుతుందని అన్నారు.  ఆఫ్రికా వంటి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో భారీ ఎగుమతి సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఎగ్జిబిషన్‌లు, ఫెయిర్‌లను నిర్వహించడానికి కూడా నిధులు మంజూరు చేయాలనీ ఆయన కోరారు.  ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన 2023–24 బడ్జెట్‌ను పార్లమెంటులో సమర్పిస్తారని భావిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement