దాతృత్వంపై ఎలాన్ మస్క్ ట్వీట్! | Elon Musk Sparks Controversy Over MacKenzie Scott Massive Philanthropy | Sakshi
Sakshi News home page

దాతృత్వంపై ఎలాన్ మస్క్ ట్వీట్!

Jun 29 2026 5:22 PM | Updated on Jun 29 2026 5:48 PM

Elon Musk Sparks Controversy Over MacKenzie Scott Massive Philanthropy

ప్రపంచ కుబేరుడు, ప్రముఖ వ్యాపారవేత్త 'ఎలాన్ మస్క్' జెఫ్ బెజోస్ మాజీ భార్య మెకెంజీ స్కాట్ చేస్తున్న దాతృత్వ కార్యక్రమాలపై చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు కారణమయ్యాయి.

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మాజీ భార్య మెకెంజీ స్కాట్ చేసిన భారీ దాతృత్వ కార్యక్రమం సమాజానికి మేలు చేయడం కంటే కీడు చేస్తున్నాయని మస్క్ అభిప్రాయపడ్డారు.

మెకెంజీ స్కాట్ ఇప్పటివరకు సుమారు 26.3 బిలియన్ డాలర్లకు పైగా వివిధ చారిటీలకు అందించారు. ఇది వ్యక్తిగత స్థాయిలో చూస్తే.. చరిత్రలోనే అత్యంత పెద్ద దానాలలో ఒకటిగా నిలిచింది. ఆమె 2019లో జెఫ్ బెజోస్‌తో విడాకులు తీసుకున్న తరువాత.. వచ్చిన అమెజాన్ వాటా సంపదలో ఎక్కువ భాగాన్ని సమాజ సేవ కోసం వినియోగించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే 'యీల్డ్ గివింగ్' పేరుతో ఆమె ప్రపంచవ్యాప్తంగా సుమారు 2,700కు పైగా నాన్‌ప్రాఫిట్ సంస్థలకు సహాయం చేశారు. వీటిలో హోవార్డ్ యూనివర్సిటీతో పాటు పలు వాతావరణ, సామాజిక అభివృద్ధి సంస్థలు ఉన్నాయి.

అయితే.. ఈ విస్తృత దానాలపై ఎలాన్ మస్క్ స్పందిస్తూ, అవి సమాజానికి హానికరంగా మారుతున్నాయని పేర్కొన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఒక యూజర్ చేసిన వ్యాఖ్యకు సమాధానంగా ఆయన స్పందించడం, ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది. దీనిని చాలా మంది మెకెంజీ స్కాట్ దానాలపై పరోక్ష విమర్శగా భావించారు.

ఇక 2024లో కూడా మస్క్ చేసిన ఒక పోస్ట్ ఈ చర్చను మరింత పెంచింది. అప్పట్లో ''మాజీ భార్యలు తమ మాజీ భర్తలను ద్వేషిస్తూ.. చేసే దానాలు పాశ్చాత్య నాగరికత క్షీణతకు కారణాలలో ఒకటి' అనే అర్థం వచ్చేలా ఆయన వ్యాఖ్యానించారు. ఆ పోస్ట్‌లో తాను ఎవరి పేరును ప్రస్తావించకపోయినా, అది మెకెంజీ స్కాట్‌ను ఉద్దేశించి చేసినదేనని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీయడంతో తరువాత ఆ పోస్ట్ తొలగించడం జరిగింది.

ఎవరెన్ని విధాలుగా మాట్లాడినా, విమర్శించినా.. మెకెంజీ స్కాట్ మాత్రం తన దాతృత్వ విధానాన్ని కొనసాగిస్తూ, సమాజంలో వెనుకబడిన వర్గాలకు సహాయం చేయడమే తన లక్ష్యమని చెబుతున్నారు. ఆమె 'నా సంపద పూర్తిగా అయిపోయే వరకు దానం చేస్తూనే ఉంటాను' అని గతంలో ప్రకటించారు. అయితే.. ఎలాన్ మస్క్ వ్యాఖ్యలు దాతృత్వం ప్రభావం సమాజంపై ఎలా ఉంటుందనే విషయంపై కొత్త చర్చను దారితీసాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement