
1 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి ప్రకటన
గ్లోబల్ ఫార్మా దిగ్గజం ఎలి లిల్లీ అండ్ కంపెనీ (Eli Lilly and Company) భారతదేశంలో తయారీ కార్యకలాపాలను విస్తరించడానికి 1 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడిని ప్రకటించింది. ఇందులో భాగంగా తెలంగాణలోని హైదరాబాద్‌లో మాన్యుఫ్యాక్చరింగ్, క్వాలిటీ హబ్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ కేంద్రం భారతదేశం అంతటా కంపెనీ కాంట్రాక్ట్ తయారీ నెట్‌వర్క్‌ను పర్యవేక్షిస్తుంది.
ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కంపెనీ ప్రతినిధులను ప్రశంసించారు. ఇది ప్రపంచ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణల కేంద్రంగా హైదరాబాద్ ఆవిర్భవించడానికి సంకేతమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..రాష్ట్ర సాంకేతిక పరిజ్ఞానంతో మమేకమైన మౌలిక సదుపాయాలు, సులభతర వ్యాపారం (Ease of Doing Business) వంటి అంశాలు ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడానికి కీలకం అవుతున్నట్లు చెప్పారు.
కంపెనీ ఏర్పాటు చేయబోయే అత్యాధునిక సదుపాయంలో ఇంజినీర్లు, రసాయన శాస్త్రవేత్తలు, ఇతర శాస్త్రవేత్తలు, నిపుణుల కోసం తక్షణమే నియామక ప్రక్రియను ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. హైదరాబాద్‌లో ‘మేక్ ఇన్ ఇండియా’ చొరవకు బలాన్ని ఇస్తూ వినూత్న ఔషధాలను ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా లిల్లీ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పాట్రిక్ జాన్సన్ మాట్లాడుతూ..‘మా గ్లోబల్ నెట్‌వర్క్ సామర్థ్యాన్ని పెంపొందించడానికి కేంద్రంగా భారతదేశంలో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని పేర్కొన్నారు. లిల్లీ డయాబెటిస్, ఊబకాయం, అల్జీమర్స్, క్యాన్సర్.. వంటి వాటికి ఔషధాలు తయారు చేస్తోంది. గురుగ్రామ్, బెంగళూరు, హైదరాబాద్ కేంద్రంగా కంపెనీ ఇప్పటికే దేశవ్యాప్తంగా కార్యకలాపాలు సాగిస్తోంది.
ఇదీ చదవండి: దేశం విడిచిన కుబేరులు.. కారణాలు..