పుంజుకుంటున్న దేశీయ విమానయానం

Domestic passenger traffic registers sequential growth of 19per cent in November - Sakshi

నవంబర్‌లో 62 లక్షలకు చేరిన ప్రయాణీకులు

ముంబై: దేశీయ విమాన ప్రయాణీకుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఈ ఏడాది నవంబర్‌లో పాసింజర్స్‌ సంఖ్య 62 లక్షలకు చేరింది. క్రితం నెలతో పోలిస్తే ఇది 19 శాతం వృద్ధి అని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. అయితే వార్షిక ప్రయాణీకుల పరిమాణంతో పోలిస్తే మాత్రం ఇది 52 శాతం క్షీణతని పేర్కొంది. లాక్‌డాన్‌ నేపథ్యంలో రెండు నెలల విరామం అనంతరం మేలో 416 దేశీయ విమాన సర్వీస్‌లతో పునఃప్రారంభం కాగా.. ప్రస్తుతం విమానాల సంఖ్య 2,065కు పెరిగింది. నవంబర్‌లో సగటున రోజుకు 1,806 డిపార్చర్స్‌ జరుగుతున్నాయని.. గతేడాది ఇదే సమయంలో డిపార్చర్స్‌ 3,080గా ఉన్నాయి. అయితే ఈ ఏడాది అక్టోబర్‌లో మాత్రం డిపార్చర్స్‌ సంఖ్య 1,574గా ఉంది. ఈ ఏడాది నవంబర్‌లో ఒక్కో విమానంలో సగటున ప్రయాణీకుల సంఖ్య 115గా ఉంది. గతేడాది ఇది 140గా ఉంది.

ఇక అంతర్జాతీయ విమాన ప్రయాణీల డిమాండ్‌ను చూస్తే.. ఈ ఏడాది నవంబర్‌లో 83 శాతం క్షీణతతో 3.6 లక్షలకు చేరింది. అంతర్జాతీయ విమాన సర్వీస్‌ల షెడ్యూల్స్‌ రద్దు ఇందుకు ప్రధాన కారణమని తెలిపింది. ప్రస్తుతం వందే భారత్‌ మిషన్, ఎయిర్‌ బబుల్‌ ఒప్పందాల వంటి ప్రత్యేక ఏర్పాట్ల కింద విదేశీ మార్గాల్లో విమాన సర్వీస్‌లు నడుస్తున్న విషయం తెలిసిందే. అనేక దేశాల్లో దీర్ఘకాలం ఉత్పాదక కార్యకలాపాలు నిలుపుదల చేయడం, ప్రపంచ ఆర్ధిక కార్యకలాపాలపై కోవిడ్‌–19 వైరస్‌ ప్రభావం వంటి కారణాలతో ముడి చమురు ధరల ప్రభావం చూపించిందని.. దీంతో ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌ (ఏటీఎఫ్‌) ధరలు నవంబర్‌లో 4.6 శాతం, డిసెంబర్‌లో 9.1 శాతం పెరిగాయని ఇక్రా వైస్‌ ప్రెసిడెంట్‌ కింజల్‌ షా తెలిపారు.

ప్రయాణికులకు రూ.3,200 కోట్ల వాపసు
లాక్‌డౌన్‌ కారణంగా విమానాల రద్దుతో చెల్లింపులు
న్యూఢిల్లీ: ఎయిర్‌లైన్‌ సంస్థలు ప్రయాణికులకు రూ.3,200 కోట్ల మేర చెల్లింపులు చేశాయి. కరోనా వైరస్‌ నియంత్రణ కోసం ఈ ఏడాది మార్చి చివరి వారంలో కేంద్రం లాక్‌డౌన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి సుమారు రెండు నెలల పాటు విమానాలు కదల్లేదు. దీంతో ఆయా రోజుల్లో ప్రయాణాల కోసం ముందుగానే ఫ్లయిట్‌ టికెట్లను బుక్‌ చేసుకున్న వారు ప్రయాణించలేకపోయారు. దీంతో మార్చి 25 నుంచి మే 24 మధ్య రద్దయిన విమానాలకు సంబంధించి టికెట్లు బుక్‌ చేసుకున్న ప్రయాణికులకు తక్షణమే, పూర్తి డబ్బును వాపసు చేయాలంటూ అక్టోబర్‌ 1న సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మొత్తం ప్రయాణికుల్లో 74.3 శాతం మందికి (55,23,940 పీఎన్‌ఆర్‌లు) రూ.3,200 కోట్లను తిరిగి చెల్లించేసినట్టు, మిగిలిన వారికి చెల్లింపుల ప్రక్రియ కొనసాగుతోందని పౌర విమానయాన శాఖా శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top