
పక్కవీధిలోని చిన్న కొట్టులో చాయ్ అమ్ముకునే వ్యక్తి క్రమంగా ఎదుగుతూ, అందరూ ఆదరించేలా చాయ్ తయారు చేస్తూ.. దేశవ్యాప్తంగా ఫ్రాంచైజీలను ఏర్పాటు చేసే స్థాయికి వెళ్తే.. ఆహా అనాల్సిందే కదా. నాగ్‌పూర్‌కు చెందిన డాలీ బతుకుతెరువు కోసం చిన్న కొట్టులో చాయ్ అమ్ముతుండేవాడు. ఒక్కసారి తన చాయ్ తాగినవారు మళ్లీ తాగాలనిపించేలా తయారు చేయడం తన ప్రత్యేకత. దాంతో నగరంలోని చాలా ప్రదేశాల నుంచి తన టీస్టాల్ వద్దకు కస్టమర్లు వచ్చేవారు. క్రమంగా నాగ్‌పూర్‌లో డాలీ చాలా ఫేమస్ అయ్యారు.
ఒకనొక సందర్భంలో డాలీ ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్‌గేట్స్‌కు తన చాయ్ రుచి చూపించే అవకాశం కూడా వచ్చింది. దాంతో డాలీ చాయ్‌వాలా మరింత ఫేమస్ అయ్యారు. ఇటీవల డాలీ చాయ్‌వాలా ‘డాలీ కీ తప్రి’ పేరుతో దేశవ్యాప్తంగా ఫ్రాంచైజీలను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. దాంతో ఏకంగా రెండు రోజుల్లో 1,600కు పైగా దరఖాస్తులు వచ్చాయి. అందుకోసం ప్రత్యేకంగా ధరలు కూడా నిర్ణయించారు. కార్ట్ స్టాల్ కోసం రూ.4.5 లక్షలు-రూ.6 లక్షలు, స్టోర్ మోడల్ రూ.20 లక్షలు-రూ.22లక్షలు, రూ.ఫ్లాగ్‌షిప్ కేఫ్ రూ.39 లక్షలు-రూ.43 లక్షలు వరకు ఫ్రాంచైజీ ధరలున్నాయి.
ఒక వీడియోలో డాలీ తన విజయం గురించి మాట్లాడుతూ..‘నాకు పాఠశాలకు వెళ్లే అవకాశం రాలేదు. కానీ నేనెప్పుడూ అవకాశాలను వదులుకోలేదు. చాయ్‌తో ప్రత్యేక ఐడెంటిటీని సంపాదించుకున్నాను. నాతో పాటు ఇతరులు ఎదగాలని కోరుకుంటున్నాను’ అని చెప్పారు. ఫ్రాంచైజీ ప్రకటనలో భాగంగా డాలీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఇది భారతదేశపు మొదటి వైరల్ స్ట్రీట్ బ్రాండ్. ప్రస్తుతం ఇది నిజమైన అభిరుచి ఉన్న వ్యక్తులను ఒక వ్యాపార అవకాశం’ అని రాసుకొచ్చారు.
ఇదీ చదవండి: గగనతలంలో గస్తీకాసే రారాజులు
ఈ ప్రకటనపై సామాజిక మాధ్యమాల్లో మిశ్రమ స్పందన వస్తోంది. ‘బర్గర్లు తింటారా అని అడిగే స్థాయి నుంచి వాటిని విక్రయించే స్థాయికి చేరారు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇంకొకరు వార్నింగ్ ఇస్తూ ‘ఏ ఫ్రాంచైజీ తీసుకోకండి’ అంటూ రిప్లై ఇచ్చాడు.