డిపాజిట్‌ బీమాతో బ్యాంకులపై ధీమా

Deposit insurance reforms to instil confidence in people on banking - Sakshi

బ్యాంకింగ్‌ సంస్కరణలపై ప్రధాని నరేంద్ర మోదీ

ఇప్పటిదాకా లక్ష మందికి పైగా ఖాతాదారులకు రూ. 1,300 కోట్లు

త్వరలో మరో 3 లక్షల మందికి చెల్లింపులు

న్యూఢిల్లీ: ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిపాజిట్‌ బీమా సంస్కరణలు .. బ్యాంకింగ్‌ వ్యవస్థపై ఖాతాదారుల్లో విశ్వాసాన్ని మరింతగా పెంచగలవని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భవిష్యత్తులో బ్యాంకు విఫలమైనా, డిపాజిటర్ల సొమ్ము భద్రంగా ఉంటుందనే భరోసా ఈ సంస్కరణలతో లభించిందని ’డిపాజిటర్స్‌ ఫస్ట్‌’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. బ్యాంకు డిపాజిట్లకు సంబంధించి బీమా పరిమితిని ప్రభుత్వం ఇటీవల రూ. 5 లక్షలకు పెంచిన సంగతి తెలిసిందే. సంక్షోభంలో ఉన్న బ్యాంకుపై ఆర్‌బీఐ మారటోరియం విధించిన పక్షంలో ఈ స్థాయి వరకూ డిపాజిట్లు ఉన్న వారు.. 90 రోజుల్లోగా తమ డబ్బు పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది.

సంబంధిత చట్టాన్ని అమల్లోకి తెచ్చాక గత కొద్ది రోజుల్లో సుమారు 1 లక్ష మంది పైగా ఖాతాదారులకు రూ. 1,300 కోట్ల పైచిలుకు అందిందని ప్రధాని చెప్పారు. ఆర్‌బీఐ మారటోరియం ఆంక్షలు ఎదుర్కొంటున్న మిగతా బ్యాంకుల్లోని మరో 3 లక్షల మంది ఖాతాదారులకు కూడా త్వరలో వారి డిపాజిట్‌ మొత్తం లభించగలదని ఆయన తెలిపారు. 16 పట్టణ సహకార బ్యాంకుల డిపాజిట్‌దారుల నుంచి వచ్చిన క్లెయిమ్స్‌కు సంబంధించి తొలి విడత చెల్లింపులను డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ క్రెడిట్‌ గ్యారంటీ కార్పొరేషన్‌ ఇటీవలే విడుదల చేసిందని మోదీ చెప్పారు. రెండో విడత డిసెంబర్‌ 31న విడుదల కానున్నట్లు పేర్కొన్నారు.

డిపాజిటర్ల ప్రయోజనాలపై ప్రత్యేక దృష్టి..: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌
ఖాతాదారుల ప్రయోజనాలను పరిరక్షించడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెడుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. దేశ పురోగతిలో బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తాయని, బ్యాంకులు బాగుండాలంటే డిపాజిటర్ల సొమ్ము సురక్షితంగా ఉండటం కూడా చాలా ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. అటు మధ్యతరగతి గృహ కొనుగోలుదారుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని .. ఆర్థిక సమస్యలతో నిల్చిపోయిన పలు హౌసింగ్‌ ప్రాజెక్టులకు నిధులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు.  

అధిక వడ్డీలకు ఆశపడితే రిస్కు: ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌
అధిక వడ్డీ రాబడుల కోసం ఆశపడితే అసలుకే ఎసరు వచ్చే ముప్పు ఉంటుందని డిపాజిట్‌దారులను రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ హెచ్చరించారు. అధిక రాబడులు లేదా అధిక వడ్డీ రేట్లతో రిస్కులు కూడా ఎక్కువగానే ఉంటాయన్న సంగతి గుర్తుంచుకోవాలని ’డిపాజిటర్స్‌ ఫస్ట్‌’  కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సూచించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top