ఇళ్లకైనా, ఆఫీసులకైనా.. అక్కడే డిమాండ్! | Demand For Houses and Offices is High in West Hyderabad | Sakshi
Sakshi News home page

ఇళ్లకైనా, ఆఫీసులకైనా.. అక్కడే డిమాండ్!

Jan 18 2026 3:01 PM | Updated on Jan 18 2026 3:18 PM

Demand For Houses and Offices is High in West Hyderabad

మెరుగైన మౌలిక సదుపాయాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉన్న ప్రాంతంలో గృహాలకే కాదు కార్యాలయ స్థలాలకూ అధికంగా డిమాండ్‌ ఉంటుంది. అందుకే హైదరాబాద్‌లో పశ్చిమ ప్రాంతం గృహ కొనుగోలుదారులకు, బహుళ జాతి సంస్థలకు హాట్‌ ఫేవరేట్‌ ప్లేస్‌గా మారింది. గతేడాది జులై–డిసెంబర్‌ (హెచ్‌–2)లో పశ్చిమ హైదరాబాద్‌ హవా కొనసాగింది. 2025 హెచ్‌2లో 19,355 ఇళ్ల విక్రయాలు జరిగాయి. ఇందులో వెస్ట్‌ సిటీ వాటా 63 శాతం కాగా.. ఇదే సమయంలో నగరంలో 55 లక్షల చ.అ. ఆఫీసు స్థలం లావాదేవీలు జరిగాయి. ఇందులో పశ్చిమం వాటా 88 శాతంగా ఉందని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా అధ్యయనం వెల్లడించింది. - సాక్షి, సిటీబ్యూరో

మెరుగైన మౌలిక సదుపాయాలు, తక్కువ జీవనశైలి వ్యయం, ఉద్యోగ, ఉపాధి అవకాశాల వృద్ధి, కట్టుదిట్టమైన శాంతి భద్రతలు, ఆహ్లాదకరమైన వాతావరణం, కాస్మోపాలిటన్‌ కల్చర్‌ వంటి రకరకాల కారణంగా హైదరాబాద్‌లో నివాసం ఉండేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో నగరంలో గృహాలకు డిమాండ్‌ పెరుగుతూనే ఉంది. స్థిరమైన ఆదాయం, మెరుగైన ఫైనాన్సింగ్‌ పరిస్థితుల కారణంగా అద్దె ఆదాయం కోసం పెట్టుబడి రీత్యా కాకుండా సొంతంగా ఉండేందుకు నివాసాలను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ముందుకొస్తున్నారు. ఇళ్ల అమ్మకాల్లో కూకట్‌పల్లి, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కోకాపేట వంటి పశి్చమ హైదరాబాద్‌ హవా కొనుసాగుతూనే ఉంది. ఐటీహబ్, అంతర్జాతీయ స్థాయి మౌలిక, సామాజిక వసతులు, స్థిరమైన ఆదాయాలు వంటివి డిమాండ్‌కు ప్రధాన కారణాలు.

పెరిగిన దక్షిణం, తూర్పు..
సాధారణంగా భారతీయ కుటుంబాలు ప్రాపర్టీ విక్రయాల్లో వాస్తును తప్పనిసరిగా అనుసరిస్తుంటారు. తూర్పు ముఖంగా ప్రధాన ద్వారం ఉన్న ఇళ్లు, దక్షిణంలో స్థలం పెరిగిన ప్రాపరీ్టలకు డిమాండ్‌ అధికంగా ఉంటుంది. ఈ కారణంగానే నగరంలో ఈ జోన్లలో ఇళ్ల అమ్మకాలు పెరిగాయి. రాజేంద్రనగర్, శంషాబాద్‌ వంటి దక్షిణ హైదరాబాద్‌ అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌గా ఎదుగుతోంది. ఇళ్ల విక్రయాలలో ఈ జోన్‌ వాటా ఏడాది కాలంలో 5 శాతం నుంచి ఏకంగా 9 శాతానికి పెరిగింది. కనెక్టివిటీ, ఉపాధి అవకాశాల పెరుగుదల, మౌలిక సదుపాయాల ఆధారిత వృద్ధి కారిడార్లతో ఈ జోన్‌ కొనుగోలుదారుల్లో నమ్మకాన్ని పెంచింది. ఇక, ఉప్పల్, మల్కాజ్‌గిరి, ఎల్బీనగర్‌ వంటి తూర్పు హైదరాబాద్‌ వాటా స్థిరంగా 9 శాతంగా ఉంది. ప్రధాన ఉద్యోగ కేంద్రాలకు కనెక్టివిటీ లేకపోవడంతో తూర్పు ప్రాంతంలో కేవలం ధరల పోటీతోనే లావాదేవీలు జరుగుతుంటాయి.

తగ్గిన ఉత్తరం, సెంట్రల్‌..
ఇక, కొంపల్లి, మేడ్చల్, అల్వాల్, కుత్బుల్లాపూర్‌ వంటి ఉత్తర హైదరాబాద్‌ వాటా 19 శాతం నుంచి 17 శాతానికి క్షీణించింది. సాధారణంగా అందుబాటు గృహాలకు పెట్టింది పేరైన ఉత్తర హైదరాబాద్‌లో కస్టమర్ల అభిరుచిని అంచనా వేయకుండా ప్రీమియం ప్రాజెక్ట్‌లు పెద్ద ఎత్తున సప్లై కావడంతో డిమాండ్‌ తగ్గింది. భూమి కొరత, నియంత్రణ పరిమితుల కారణంగా బేగంపేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, సోమాజిగూడ వంటి సెంట్రల్‌ హైదరాబాద్‌ వాటా 3 శాతానికి తగ్గింది.

ప్రీమియం ఇళ్లకే మొగ్గు..
2025 రెండో అర్ధభాగంలో అమ్ముడుపోయిన ఇళ్లలో రూ.కోటి కంటే తక్కువ ధర ఉన్న యూనిట్ల వాటా 71 శాతంతో ఆధిపత్యాన్ని కొనసాగించాయి. అంతకుముందు ఏడాది హెచ్‌–2లో ఈ విభాగం వాటా 63 శాతంగా ఉంది. రూ.1.2 కోట్ల రేటు ఉన్న ఇళ్ల వాటా 44 శాతంగా ఉంది. ఇక, రూ.2.5 కోట్ల ధర ఉన్న విలాసవంతమైన గృహాల వాటా ఏకంగా 13 శాతం నుంచి 22 శాతానికి పెరిగింది. లగ్జరీ లైఫ్‌ స్టైల్, ఆధునిక వసతులు, గేటెడ్‌ కమ్యూనిటీ లివింగ్‌ వైపు కస్టమర్లు ఆసక్తి చూపించడంతో ఈ విభాగంలో ఇళ్ల విక్రయాలు పెరిగాయి. రూ.5 నుంచి రూ.10 కోట్ల ధర ఉన్న యూనిట్ల విక్రయాలు కూడా 3 శాతం నుంచి స్వల్పంగా 4 శాతానికి వృద్ధి చెందాయి.

ఆఫీసు అ'ధర'హో..
నగరంలో హెచ్‌ 2లో 55 లక్షల చ.అ. ఆఫీసు స్పేస్‌ లావాదేవీలు జరిగాయి. అంతకుముందు ఏడాది హెచ్‌ 2తో పోలిస్తే ఇది 4 శాతం ఎక్కువ. ఇందులో హైటెక్‌ సిటీ, కొండాపూర్, రాయదుర్గం వంటి సబర్బన్‌ బిజినెస్‌ డిస్ట్రిక్ట్‌(ఎస్‌బీడీ) వాటా 88 శాతంగా ఉండగా.. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట వంటి సెంట్రల్‌ బిజినెస్‌ డి్రస్టిక్ట్‌(సీబీడీ) ప్రాంతాల వాటా 6 శాతం, గచ్చిబౌలి, కోకాపేట, నానక్‌రాంగూడ వంటి పశ్చిమ ప్రాంతాలు(పీబీడీ–వెస్ట్‌) వాటా 2 శాతం, ఉప్పల్, పోచారం వంటి తూర్పు ప్రాంతాలు(పీబీడీ–ఈస్ట్‌) వాటా 4 శాతంగా ఉన్నాయి. గతేడాది హెచ్‌–2లో సగటు లావాదేవీ అద్దె చ.అ.కు రూ.77గా ఉంది.

లాంచింగ్స్‌లో వెస్ట్‌దే
నివాస విభాగంలో విలాసవంతమైన గృహాలకు డిమాండ్‌ పెరుగుతూనే ఉంది. గృహ కొనుగోలుదారుల అభిరుచుల మేరకు డెవలపర్లు కూడా ప్రీమియం ప్రాజెక్ట్‌ల నిర్మాణాలకే మొగ్గు చూపిస్తున్నారు. దీంతో ఇళ్ల విక్రయాలతో పాటు లాంచింగ్స్‌లోనూ లగ్జరీ యూనిట్లవే ఎక్కువ వాటా కలిగి ఉన్నాయి. 2025 హెచ్‌–2లో నగరంలో కొత్తగా 19,775 యూనిట్లు లాంచింగ్‌ అయ్యాయి. ప్రీమియం ఇళ్ల నిర్మాణాలకు డెవలపర్లు ఆసక్తి చూపించడం, కస్టమర్ల ప్రాధాన్యతల నేపథ్యంలో 2024 హెచ్‌–2తో పోలిస్తే లాంచింగ్స్‌ 9 శాతం మేర క్షీణించాయి. ఇక, జోన్ల వారీగా చూస్తే.. లాంచింగ్స్‌లో పశ్చిమ హైదరాబాద్‌ వాటా 62 శాతంగా ఉండగా.. ఉత్తరం 15 శాతం, దక్షిణం 10 శాతం, తూర్పు 8 శాతం, సెంట్రల్‌ సిటీ వాటా 5 శాతంగా ఉంది.

నగరంలోని ఆఫీసు స్పేస్‌ లావాదేవీల్లో గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్లు(జీసీసీ)లదే హవా కొనసాగుతోంది. నగరంలో 2025 హెచ్‌–2లో జరిగిన కార్యాలయ స్థలాల లీజులలో జీసీసీల వాటా ఏకంగా 50 శాతంగా ఉంది. చార్లెస్‌ స్క్వాబ్‌ కార్పొరేషన్, వార్నర్‌ బ్రదర్స్‌ డిస్కవరీ, రాండ్‌స్టాడ్, గోల్డ్‌మన్‌ సాచ్స్, సర్వీస్ నౌ వంటి బహుళ జాతి సంస్థలు నగరంలో జీసీసీలను ఏర్పాటు చేశాయి. ఆ తర్వాత ఆఫీసు స్పేస్‌ లీజులు 25 శాతం వాటాతో ఫ్లెక్సిబుల్‌ స్పేస్‌ విభాగం ఉంది. థర్ట్‌ పార్టీ సంస్థల లావాదేవీలు 16 శాతంగా ఉంది. ఇక, నగరంలో ఆఫీసు స్థలం అద్దెలు వార్షిక ప్రాతిపదికన 10 శాతం మేర పెరిగి, ప్రస్తుతం నెలకు చ.అ.కు రూ.77గా ఉన్నాయి.

ఆసక్తి తగ్గినా ఆఫర్డబుల్
నగరంలో అందుబాటు గృహాలకు ఆదరణ తగ్గుతూనే ఉంది. రూ.50 లక్షల కంటే తక్కువ ధర ఉన్న ఇళ్ల విక్రయాలు 5 శాతం నుంచి 4 శాతానికి తగ్గాయి. అలాగే రూ.50 లక్షల నుంచి రూ.కోటి ధర ఉన్న ఇళ్ల వాటా కూడా 31 శాతం నుంచి 26 శాతానికి క్షీణించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement