
ఆర్టిఫీషియల్ వినియోగం విస్తృతంగా పెరిగిపోయింది. ఇది లేదనకుండా ఏఐ అన్ని పనులూ చేసేస్తోంది. నోయిడాకు చెందిన అనుభవజ్ఞురాలైన ప్రొడక్ట్ మేనేజర్ రాధికా శర్మకు ఇటీవల ఒక ప్రత్యేకమైన ఉద్యోగ ఇంటర్వ్యూ అనుభవం ఎదురైంది. అక్కడ ఆమెను హ్యూమన్ ప్యానెల్‌కు బదులుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత రోబోట్ ఇంటర్వ్యూయర్ అంచనా వేశారు.
టెక్ లో దాదాపు దశాబ్ద అనుభవం ఉన్న శర్మ బిజినెస్ ఇన్ సైడర్ తో తన అనుభవాన్ని పంచుకున్నారు. వర్చువల్ స్క్రీనింగ్ సిస్టమ్ ఆమె నైపుణ్యాలను అంచనా వేయడమే కాకుండా ఆమె వస్త్రధారణపైనా ఫీడ్ బ్యాక్ అందించిందని వెల్లడించారు. ఈ అనుభవాన్ని "అద్భుతమైన అదేసమయంలో కలవరపరిచేది"గా ఆమె అభివర్ణించారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఇంటర్వ్యూ ప్రక్రియ నుండి లాభనష్టాలు, ఇతర కీలక అంశాలను చర్చించారు.
చిన్నదైన కుమార్తె సంరక్షణ కోసం రాధికా శర్మ తన ప్రొడక్ట్ ఓనర్ బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. ఇప్పుడు ప్రొడక్ట్ మేనేజ్ మెంట్ పొజిషన్ ను వెతుక్కుంటూ మళ్లీ జాబ్ మార్కెట్లోకి రీఎంట్రీ ఇస్తోంది. ఒక సాస్ కంపెనీ ఆమెను ఏఐ(AI) ఆధారిత స్క్రీనింగ్ ఇంటర్వ్యూకు ఆహ్వానించింది. ఇంటర్వ్యూ ప్రక్రియ ప్రారంభానికి ముందు నిశ్శబ్ద వాతావరణం ఉండేలా చూసుకోవాలని, కంప్యూటర్‌లోని ట్యాబ్ లను మార్చవద్దని, పర్యవేక్షణ కోసం స్క్రీన్ షేరింగ్ చేయాలని అవతల నుంచి సూచనలు వచ్చాయి.
‘ఇంటర్వ్యూ ప్రారంభమైన వెంటనే, సుమారు 20 నిమిషాల టైమర్ ప్రారంభమైంది. అటు పక్క నుంచి మహిళా వాయిస్ తో కూడిన ఖాళీ స్క్రీన్ నన్ను పలకరించింది. ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ గురించి చాలా నిర్దిష్టమైన ప్రశ్నలు అడగడం ప్రారంభించింది" అని రాధికా శర్మ చెప్పారు. ఈ ఇంటర్వ్యూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జరుగుతుందని కంపెనీ ముందుగానే స్పష్టంగా పేర్కొంది. ఇంటర్వ్యూ ముగిసిన వెంటనే శర్మ ఏఐ టూల్ నుంచి సవివరమైన పనితీరు మదింపును అందుకున్నారు.
తాను నిమగ్నమయ్యే విధానం, ఐ కాంటాక్ట్, ముఖ కవళికలు, భంగిమలు, వస్త్రధారణ వంటి అన్ని కొలమానాలతో పాటు ఆమె సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏఐ అంచనా వేసింది. ఆమె సాంకేతిక నైపుణ్యాలు బాగా సాధించినప్పటికీ, ఆమె దుస్తులు ప్రొఫెషనల్‌గా ధరించలేదని, ఐ కాంటాక్ట్ సక్రమంగా లేదని పేర్కొంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలను తక్కువగా అంచనా వేశానని, అమ్మో ఏఐ అన్నింటినీ క్షణ్ణంగా గమనిస్తుందని రాధికా శర్మ చెప్పుకొచ్చారు.