ఆకర్షణ కోల్పోతున్న డెబిట్‌ కార్డు.. దూసుకుపోతున్న క్రెడిట్‌ కార్డు!

Credit Card Overtakes Debit Transactions In India 2023 - Sakshi

వినియోగంలో అధిక ప్రాధాన్యం  

యూపీఐ తర్వాత క్రెడిట్‌ కార్డులే

మారుతున్న ప్రజల ధోరణి

చిన్నబోతున్న డెబిట్‌ కార్డులు

న్యూఢిల్లీ: డెబిట్‌ కార్డ్‌ ఇప్పుడు తన ఆకర్షణ కోల్పోతోంది. దీని స్థానంలో క్రెడిట్‌ కార్డు ఆకర్షణీయంగా మారుతోంది. డెబిట్‌ కార్డు బదులు క్రెడిట్‌ కార్డుతో చెల్లింపుల లావాదేవీలు నిర్వహించడానికే ఎక్కువ మంది ప్రజలు మొగ్గు చూపిస్తున్నట్టు ఆర్‌బీఐ గణాంకాలు తెలియజేస్తున్నాయి. దశాబ్దం క్రితం డెబిట్‌ కార్డులే చెల్లింపుల్లో సింహ భాగం వాటా కలిగి ఉంటే, నేడు క్రెడిట్‌ కార్డులు ఎక్స్‌ప్రెస్‌ వేగంతో ఎక్కువ మంది వినియోగదారులను చేరుకుంటున్నాయి.

కార్డుతో చెల్లించినప్పటికీ, 45 రోజుల వరకు ఆ బకాయి తీర్చేందుకు వ్యవధి ఉండడం, చెల్లింపులపై రివార్డులు ఆకర్షణీయమని చెప్పుకోవాలి. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో డెబిట్‌ కార్డుల ద్వారా 22 కోట్ల మర్చంట్‌ (వర్తకులు) చెల్లింపులు నమోదు అయితే, అదే నెలలో క్రెడిట్‌ కార్డుల ద్వారా చెల్లింపుల లావాదేవీలు 25 కోట్లుగా ఉన్నాయి.

కానీ, విలువ పరంగా చూస్తే.. ఏప్రిల్‌ నెలలో క్రెడిట్‌ కార్డుల ద్వారా రూ.1.3 లక్షల కోట్ల విలువైన చెల్లింపుల జరిగితే, డెబిట్‌ కార్డుల లావాదేవీల విలువ ఇందులో సగానికంటే తక్కువ రూ.53,000 కోట్లుగానే ఉంది. ఇవన్నీ కూడా ఈ–కామర్స్, భౌతిక దుకాణాల్లో చేసిన లావాదేవీలు కావడం గమనార్హం. మరీ ముఖ్యంగా గడిచిన ఏడాది కాలంలో క్రెడిట్‌ కార్డుల స్వైప్‌ (చెల్లింపు)లు 20 శాతం పెరగ్గా, డెబిట్‌ కార్డు స్వైప్‌లు 31 శాతం క్షీణించాయి.  
 
ఫిన్‌టెక్‌ల మద్దతు

స్టార్టప్‌లు, ఫిన్‌టెక్‌ సంస్థలు కో బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డులను తీసుకురావడానికి ప్రాధాన్యం చూపిస్తున్నాయి. మింత్రా కోటక్‌ మహీంద్రా బ్యాంకుతో, పేటీఎం ఎస్‌బీఐ కార్డ్‌తో కలసి ఇటీవలే క్రెడిట్‌ కార్డును తీసుకొచ్చాయి. పతంజలి ఆయుర్వేద్‌ సంస్థ ప్రభుత్వరంగ పీఎన్‌బీ బ్యాంక్‌తో కలసి కో బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డు తీసుకురావడం గమనార్హం. ఇలా పెద్ద సంస్థలన్నీ ఇదే బాటలో నడుస్తున్నాయి.

‘‘వస్త్రాలను విక్రయించే పెద్ద మార్కెట్‌ప్లేస్‌కు అమ్మకాలపై ఎంతలేదన్నా 50–60 శాతం లాభాల మార్జిన్‌ ఉంటుంది. దీంతో అవి తమ కోబ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డు కస్టమర్లకు 10 శాతం డిస్కౌంట్‌ ఇవ్వగలవు. తద్వారా కస్టమర్ల విశ్వసనీయతను చూరగొనవు’’అని ఓ ఫిన్‌టెక్‌ సంస్థ ఉన్నతోద్యోగి తెలిపారు. బ్యాంకులు క్రెడిట్‌ కార్డు మార్కెట్‌లో వాటా పెంచుకోవాలనే పట్టుదలతో ఉన్నాయి. కానీ, అది వాటికి పెద్ద సవాలుగా మారింది. బ్యాంకు శాఖ తరఫున ఒక్క క్రెడిట్‌ కార్డు కస్టమర్‌ను పొందేందుకు అవి రూ.2,000ను ఖర్చు చేయాల్సి వస్తోంది.

దీనితో పోలిస్తే కో బ్రాండెడ్‌ ఒప్పందం ద్వారా అయితే తక్కువ ఖర్చులోనే ఎక్కువ కస్టమర్లను చేరుకోవడం వాటిని ఆ దిశగా దృష్టి సారించేలా చేస్తోంది. అందుకే అవి ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లు, ప్ర ముఖ ఫిన్‌టెక్‌లు, కన్జ్యూమర్‌ కంపెనీలతో టైఅప్‌ కోసం కృషి చేస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ భాగస్వామ్యంతో, అమెజాన్‌ ఐసీఐసీఐ బ్యాంక్‌ సాయంతో కో బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డులను మార్కెట్‌ చేస్తుండడం గమనార్హం. పరిశ్రమ వ్యాప్తంగా క్రెడిట్‌ కార్డు యాక్టివిటీ రేటు 50 శాతంగా ఉంటే, అమెజాన్‌ ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌కార్డులో ఇది 70 శాతంగా ఉన్నట్టు అమెజాన్‌ పే ఇండియా హోల్‌టైమ్‌ డైరెక్టర్‌ వికాస్‌ బన్సాల్‌ తెలిపారు.   

యూపీఐ ప్రభావం..
డెబిట్‌ కార్డుల వినియోగం తగ్గడానికి క్రెడిట్‌ కార్డులే కాకుండా, యూపీఐ చెల్లింపుల గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. దాదాపు అన్ని దుకాణాల్లోనూ యూపీఐ యాప్‌ల ద్వారా చెల్లింపులు చేసే సౌలభ్యం ఉండడంతో డెబిట్‌ కార్డు ప్రాధాన్యం తగ్గింది. మే నెలలో 536 కోట్ల యూపీఐ మర్చంట్‌ లావాదేవీలు నమోదయ్యాయి. ఏడాది క్రితం ఇదే నెలలో ఉన్న 254 కోట్ల లావాదేవీలతో పోలిస్తే రెట్టింపయ్యాయి.

ఇప్పుడు అన్ని చెల్లింపుల సాధనాల్లోనూ యూపీఐ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత క్రెడిట్‌ కార్డు చెల్లింపులకే వినియోగదారులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రస్తుతం దేశంలో 8.5 కోట్ల క్రెడిట్‌ కార్డులు ఉన్నాయి. ఏడాది క్రితం వీటి సంఖ్య 7.5 కోట్లు. మూడేళ్ల క్రితం 5 కోట్ల కంటే తక్కువే ఉన్నాయి. ‘‘యూపీఐ మాదిరిగా కాకుండా క్రెడిట్‌ కార్డు అనేది మొత్తం ఎకోసిస్టమ్‌లో ఉన్న అందరికీ ఆదాయాన్నిచ్చే సాధనం. సాధారణంగా అధిక విలువ కొనుగోళ్లకు, వినియోగ చెల్లింపులకు దీన్ని స్వైప్‌ చేస్తుంటారు’’అని ఓ బ్యాంకర్‌ తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top