న్యూఢిల్లీ: పేమెంట్ ఆగ్రిగేటర్లకు రిజర్వ్ బ్యాంకు సూచించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఆఫ్‌లైన్ మర్చెంట్ పేమెంట్స్ వ్యాపారాన్ని తన అనుబంధ సంస్థ పేటీఎం పేమెంట్స్ సర్వీసెస్(పీపీఎస్‌ఎల్)కు బదిలీ చేసేందుకు పేటీఎం మాతృసంస్థ ‘వన్97 కమ్యూనికేషన్స్’ ఆమోదం తెలిపింది. తద్వారా గ్రూప్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మర్చెంట్ పేమెంట్స్ వ్యాపారాలు పీపీఎస్‌ఎల్ పరిధిలోకి వస్తాయని పేర్కొంది.
ఆన్‌లైన్ పేమెంట్ అగ్రిగేటర్ వ్యాపార నిర్వహణకు పీపీఎస్‌ఎస్ ఇప్పటికే ఆర్‌బీఐ నుంచి ప్రాథమిక అనుమతి పొందినట్లు వివరించింది. పేమెంట్ అగ్రిగేషన్ కార్యకలాపాలన్నీ ఒకే సంస్థ నియంత్రణలో ఉండటం వల్ల.. సమన్వయ సామర్థ్యాలు మరింత పెరుగుతాయని కంపెనీ చెప్పుకొచ్చింది.
‘‘క్యూఆర్ కోడ్‌లు, సౌండ్ బాక్సులు, ఈడీసీ మెషిన్ పేమెంట్లు ఆఫ్‌లైన్ మర్చెంట్ పేమెంట్స్ వ్యాపారం కింద వస్తాయి. పీపీఎస్‌ఎల్ బోర్డు, షేర్‌హోల్డర్ల ఆమోదానికి లోబడి బదిలీ ప్రక్రియ ఉంటుంది. కావున ఆర్థిక ఫలితాలపై ఎలాంటి ప్రభావం ఉండదు’’ అని కంపెనీ వివరణ ఇచ్చింది. గత ఆర్థిక సంవత్సరం 2024 - 25లో ఆఫ్‌లైన్ మర్చెంట్ పేటమెంట్స్ బిజినెస్ ఆదాయం రూ.2,850 కోట్లుగా నమోదైంది. కంపెనీ మొత్తం ఆదాయంలో 47% వాటా ఇది.


