లాభాలే..లాభాలు: విమనాశ్రయాల ప్రైవేటీకరణ..సమర్ధించుకున్న కేంద్రమంత్రి!

Civil Aviation Minister Jyotiraditya Comments On Privatisation - Sakshi

కరోనా ప్రభావాల నుండి విమానయాన రంగం క్రమంగా కోలుకుంటోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. గణాంకాల ప్రకారం గత ఏడు రోజుల్లో రోజువారీగా 3.82 లక్షల మంది ప్రయాణించారని ఆయన పేర్కొన్నారు. 2018–19లో 14.50 కోట్లుగా ఉన్న విమాన ప్రయాణికుల సంఖ్య 2023–24 నాటికి 40 కోట్లకు చేరగలదని అంచనా వేస్తున్నట్లు లోక్‌సభకు మంత్రి వివరించారు. 

వచ్చే 2–3 ఏళ్లలో ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, ప్రైవేట్‌ రంగ సంస్థలు విమానాశ్రయాల ఏర్పాటుపై రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులు రానున్నట్లు ఆయన చెప్పారు. విమానాశ్రయాలను ప్రైవేట్‌ సంస్థలకు లీజుకు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు. దీని వల్ల ఏఏఐ లాభదాయకత పెరుగుతుందని పేర్కొన్నారు. 2014 వరకూ దేశీయంగా 74 ఎయిర్‌పోర్టులు ఉండగా గడిచిన ఏడేళ్లలో కొత్తగా 66 విమానాశ్రయాలు వచ్చాయని సింధియా చెప్పారు.
 

దేశ ఎకానమీలో భారీగా ఉద్యోగాల కల్పన ద్వారా ఏవియేషన్‌ రంగం కీలకంగా మారిందని పేర్కొన్నారు. దేశీయంగా మొత్తం పైలట్లలో 15 శాతం మంది మహిళలే ఉన్నారని.. అంతర్జాతీయంగా ఈ సగటు 5 శాతమేనని ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఎయిర్‌లైన్‌ పరిశ్రమ ఒడిదుడుకులు ఎదురు కొంటూ ఉండగా.. భారత్‌లో రెండు కొత్త ఎయిర్‌లైన్స్‌ (జెట్, ఆకాశ) త్వరలో తమ సర్వీసులు ప్రారంభించనున్నాయని సింధియా వివరించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top