పేటీఎమ్‌ బోర్డు నుంచి చైనీస్‌ ఔట్‌

Chinese Nationals Step Down From Paytm Board Ahead of IPO - Sakshi

యూఎస్, భారత్‌ వ్యక్తులకు చోటు 

ఐపీవో ముందు కంపెనీ వ్యూహాలు 

న్యూఢిల్లీ: పబ్లిక్‌ ఇష్యూ బాట పట్టిన డిజిటల్‌ పేమెంట్స్‌ దిగ్గజం పేటీఎమ్‌ బోర్డు నుంచి చైనీయులందరూ వైదొలగనున్నట్లు తెలుస్తోంది. వీరి స్థానే యూఎస్, దేశీ వ్యక్తులు బాధ్యతలు చేపట్టనున్నట్లు పేటీఎమ్‌ తాజాగా పేర్కొంది. అయితే కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్‌ చేసిన సంస్థల వాటాల విషయంలో మార్పులు ఉండబోవని తెలియజేసింది. అలీపే ప్రతినిధి జింగ్‌ జియాన్‌ డాంగ్, యాంట్‌ ఫైనాన్షియల్స్‌కు చెందిన గువోమింగ్‌ చెంగ్, అలీబాబా ప్రతినిధులు మైఖేల్‌ యూన్‌ జెన్‌ యావో(యూఎస్‌), టింగ్‌ హాంగ్‌ కెన్నీ హో డైరెక్టర్‌ పదవుల నుంచి తప్పుకున్నట్లు పేటీఎమ్‌ వెల్లడించింది.

ప్రస్తుతం బోర్డులో చైనీయులెవరూ లేరని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. యాంట్‌ గ్రూప్‌ తరఫున యూఎస్‌ వ్యక్తి డగ్లస్‌ ఫియాగిన్‌ బాధ్యతలు చేపట్టినట్లు తెలుస్తోంది. శామా క్యాపిటల్‌కు చెందిన అషిత్‌ రంజిత్‌ లిలానీ, సాఫ్ట్‌బ్యాంక్‌ ప్రతినిధి వికాస్‌ అగ్నిహోత్రి బోర్డులో చేరినట్లు పేటీఎమ్‌ తాజాగా తెలియజేసింది. కాగా.. బెర్కషైర్‌ హాథవే ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్‌ టాడ్‌ ఆంథోనీ కాంబ్స్‌ బోర్డు నుంచి పదవీ విరమణ చేసినట్లు వెల్లడించింది.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top