దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటన కారణంగా చాందిని చౌక్ మార్కెట్‌కు భారీ వ్యాపారాన్ని నష్టపోయింది. ఎర్ర కోట సమీపంలో జరిగిన ఆత్మాహుతి దాడిగా భావిస్తున్న పేలుడు ఘటనలో 12 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఈ ఘటన అనంతరం జనాల తాకిడి ఒక్కసారిగా తగ్గిపోవడంతో మార్కెట్ వ్యాపారులు రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకూ ఆదాయాన్ని కోల్పోయినట్లు తెలుస్తోంది.
దేశంలో అతిపెద్ద హోల్ సేల్ మార్కెట్ అయిన చాందినీ చౌక్ మార్కెట్ నిత్యం జనాల రద్దీతో కిక్కిరిసి ఉంటుంది. రోజుకు సగటున దాదాపు నాలుగు లక్షల మంది ఈ మార్కెట్ను సందర్శిస్తుంటారు. ఇక్కడ ప్రతిరోజూ రూ .450 కోట్ల నుంచి రూ.500 కోట్ల విలువైన వ్యాపారం జరుగుతుందని అంచనా. అయితే, పేలుడు తర్వాత జనాల తాకిడి ఒక్కసారిగా తగ్గిపోయిందని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు.
చాందినీ చౌక్ ప్రాంతంలో వ్యాపారాలు తాత్కాలికంగానే అయినా భారీగా దెబ్బతిన్నాయని స్థానిక ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ పేర్కొన్నారు. ‘ఇక్కడ వాణిజ్యం సుమారు రూ .300-400 కోట్ల నష్టాన్ని చవిచూసింది. కానీ సాధారణ పరిస్థితులు తిరిగి వచ్చి, ట్రాఫిక్ తిరిగి ప్రారంభమైన వెంటనే, కస్టమర్ల తాకిడి తిరిగి పెరుగుతుంది. మా చాందినీ చౌక్ వ్యాపారులకు స్థైర్యం ఎక్కువ’ అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
చాందినీ చౌక్కు కొన్ని మీటర్ల దూరంలోనే ఎర్రకోట ట్రాఫిక్ సిగ్నల్ సమీపంలో సోమవారం సాయంత్రం ఆత్మాహుతి పేలుడు సంభవించింది. నెమ్మదిగా కదులుతున్న వాహనంలో అమర్చిన అధిక తీవ్రత కలిగిన పేలుడు పరికరం పేలింది. ఈ ఘటనలో 12 మంది మరణించారు.


