
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన పీఎం ఈ–డ్రైవ్ స్కీమును కొన్ని వాహన విభాగాలకు రెండేళ్ల పాటు 2028 మార్చి వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఎలక్ట్రిక్ బస్సులు, ఈ–అంబులెన్స్‌లు, ఈ–ట్రక్కులు వీటిలో ఉన్నాయి. వాస్తవానికి ఈ స్కీము గడువు 2026 మార్చితో ముగియాల్సి ఉంది.
ఈ స్కీము పరిమాణం రూ. 10,900 కోట్లకు మాత్రమే పరిమితమవుతుందని, ఒకవేళ గడువు లోగా నిధులు పూర్తిగా వినియోగించేసిన పక్షంలో.. సంబంధిత సెగ్మెంట్లు లేదా స్కీము కూడా ముగిసిపోతుందని కేంద్రం వివరించింది. మరోవైపు, రిజిస్టర్డ్ ఈ–టూవీలర్లు, ఈ–రిక్షాలు, ఈ–కార్టులు, ఈ–త్రీ వీలర్లకు ఆఖరు తేదీ యథాప్రకారంగా 2026 మార్చి 31గా ఉంటుందని పేర్కొంది.
టెక్స్‌టైల్స్ పీఎల్‌ఐ స్కీము పోర్టల్ పునఃప్రారంభం
పరిశ్రమ వర్గాల విజ్ఞప్తి మేరకు టెక్స్‌టైల్స్ రంగానికి సంబంధించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) స్కీము పోర్టల్‌ను మళ్లీ తెరిచినట్లు కేంద్రం వెల్లడించింది. ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకునేందుకు ఇది అందుబాటులో ఉంటుందని వివరించింది. గతంలో నిర్దేశించిన మార్గదర్శకాలే కొత్త దరఖాస్తులకు కూడా వర్తిస్తాయి. ఆసక్తి గల కంపెనీలన్నీ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని టెక్స్‌టైల్స్ శాఖ సూచించింది.