
రోగులకు మందులను కొంత తక్కువ ధరలకు అందించాలనే ప్రయత్నంలో భాగంగా.. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీలు విక్రయించే 35 ముఖ్యమైన ఔషధాల రిటైల్ ధరలను తగ్గించింది. మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ఈ ఉత్తర్వును జారీ చేసింది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ.. మెడిసిన్స్ కోసం ఎక్కువ ఖర్చు చేస్తున్నవారికి ఇదొక ఉపశమనం.
ధరలు తగ్గిన మెడిసిన్స్ జాబితాలో.. ఈ ఫార్ములేషన్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, కార్డియోవాస్కులర్, యాంటీబయాటిక్, యాంటీ-డయాబెటిక్ మరియు సైకియాట్రిక్ ఔషధాలతో పాటు అసెక్లోఫెనాక్, పారాసెటమాల్, ట్రిప్సిన్ కైమోట్రిప్సిన్, అమోక్సిసిలిన్, పొటాషియం క్లావులనేట్, అటోర్వాస్టాటిన్, ఎంపాగ్లిఫ్లోజిన్, సిటాగ్లిప్టిన్, మెట్‌ఫార్మిన్ వంటి కొత్త నోటి యాంటీ డయాబెటిక్ కూడా ఉన్నాయి.
అకుమ్స్ డ్రగ్స్ & ఫార్మాస్యూటికల్స్ తయారు చేసి డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ మార్కెట్ చేస్తున్న అసెక్లోఫెనాక్ పారాసెటమాల్ ట్రిప్సిన్ కైమోట్రిప్సిన్ టాబ్లెట్ ధర ఇప్పుడు రూ.13, కాడిలా ఫార్మాస్యూటికల్స్ మార్కెట్ చేస్తున్న అదే ఫార్ములేషన్ ధర ఇప్పుడు రూ.15.01గా ఉంది.
ఇదీ చదవండి: ఉజ్వల భవిష్యత్తు కోసం.. ఎల్ఐసీ స్కీమ్: నెలకు రూ.7000 అకౌంట్‌లోకి
హృదయ సంబంధ వ్యాధులకు ఉపయోగించే అటోర్వాస్టాటిన్ 40 mg, క్లోపిడోగ్రెల్ 75 mg టాబ్లెట్ ధర రూ. 25.61. పిల్లల ఉపయోగం కోసం ఓరల్ సస్పెన్షన్లు - సెఫిక్సిమ్, పారాసెటమాల్, విటమిన్ డి సప్లిమెంటేషన్ కోసం కోలెకాల్సిఫెరోల్ డ్రాప్స్, డైక్లోఫెనాక్ ఇంజెక్షన్ వంటి ముఖ్యమైన మందులతో పాటు, దీని ధర మి.లీ.కు రూ. 31.77గా నిర్ణయించారు.
రిటైలర్లు, డీలర్లు ఈ కొత్త ధరల జాబితాలను మెడికల్ షాపులలో తప్పకుండా ప్రదర్శించాలి. కొత్త ధరలను అనుసరించి విక్రయాలు జరపకుంటే.. జరిమానా విధించడంతో పాటు, అధిక ఛార్జ్ చేసిన మొత్తాలను వడ్డీతో సహా రికవరీ చేయడం జరుగుతుందని సంబంధిత అధికారులు వెల్లడించారు.
