పెరుగుతున్న కార్ల ధరలు, వినియోగదారుల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ దేశీయంగా ప్యాసింజర్ వాహనాలకు సంబంధించిన సగటు రుణ పరిమాణం గత ఏడేళ్ల వ్యవధిలో గణనీయంగా పెరిగింది. 2019 ప్రథమార్ధంతో (జనవరి–జూన్) పోలిస్తే 2026 ప్రథమార్ధంలో 49 శాతం పెరిగి రూ. 8.2 లక్షలకు చేరింది. ఇక సగటు రీపేమెంట్ వ్యవధి ఐదు నెలలు పెరిగి 62 నెలలకు చేరింది. ట్రాన్స్‌యూనియన్ సిబిల్ రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
దీని ప్రకారం మెట్రో నగరాల్లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా ఎస్‌యూవీలు, వినూత్న ఫీచర్లు ఉండే ప్రీమియం కార్లకు డిమాండ్ నెలకొనడమనేది వాహన రుణాలకు దన్నుగా నిలుస్తోంది. సెమీ–అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో జనవరి–జూన్ మధ్య కాలంలో 51 శాతం మంది కొనుగోలుదారులు ఖరీదైన కార్ల కోసం రుణాలు తీసుకున్నారు. వాహనాల రుణాల్లో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీ) అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి.
ద్విచక్ర వాహన రుణాల్లో 73 శాతం, ప్యాసింజర్ వాహన రుణాల్లో 37 శాతం వాటాను దక్కించుకున్నాయి. ఆకాంక్షలు, రేటును బట్టి కార్ల కొనుగోలు నిర్ణయాలు ఆధారపడి ఉంటున్నాయని ట్రాన్స్‌యూనియన్ సిబిల్ ఎండీ భవేష్ జైన్ తెలిపారు. కొనుగోలుదారులు ఖరీదైన, ఎక్కువ ఫీచర్లున్న వాహనాలను ఎంచుకుంటున్నట్లు వివరించారు. పెద్ద మొత్తంలో రుణాలు లభిస్తుండటం, చెల్లించేందుకు సుదీర్ఘ వ్యవధి లభిస్తుండటంతో కొనుగోళ్లు సులభతరం అవుతున్నట్లు పేర్కొన్నారు.
రిపోర్ట్‌లో ఇతర ముఖ్యాంశాలు..
క్రియాశీలకంగా ఉన్న ప్యాసింజర్ వాహన రుణగ్రహీతల సంఖ్య 2026 జూన్ ఆఖరు నాటికి 2.5 కోట్లకు చేరింది. 2019 జూన్‌తో పోలిస్తే 1.7 రెట్లు పెరిగింది. రుణాల ఎగవేత 1.45 శాతం నుంచి 0.5 శాతానికి నెమ్మదించింది.
టూ–వీలర్ రుణాలకు సంబంధించి మంచి క్రెడిట్ హిస్టరీ ఉండి, లోన్‌లు తీసుకునే వారి వాటా 43%కి పెరిగింది. తొలిసారిగా రుణం తీసుకునే వారి వాటా 39 శాతానికి తగ్గింది.
ద్విచక్ర వాహన రుణ బాకీలు 3.2 రెట్లు ఎగిసి రూ. 1.76 లక్షల కోట్లకు చేరాయి. రుణగ్రహీతల సంఖ్య 1.7 కోట్ల నుంచి 3.3 కోట్లకు పెరిగింది. డిఫాల్టులు (90 రోజులు దాటిన ఎగవేత కేసులు) 2.7 శాతం నుంచి 1.4 శాతానికి తగ్గాయి. మొత్తం టూ–వీలర్ రుణాల్లో సెమీ–అర్బన్, గ్రామీణ ప్రాంతాల రుణగ్రహీతల వాటా 64%గా ఉంది. 43 శాతం మంది రుణగ్రహీతల వయస్సు 30 ఏళ్ల లోపే ఉంది.
ద్విచక్ర వాహనాల నుంచి కార్లకు అప్‌గ్రేడ్ అయ్యే గ్రామీణ వినియోగదారుల సంఖ్య వార్షిక ప్రాతిపదికన 2019 నుంచి 15 శాతం మేర పెరిగింది.


