
ఐదేళ్లలో రూ.8.5 లక్షల కోట్ల ఏయూఎం
మూడు రెట్లు పెంచుకోవాలన్న లక్ష్యం
ముంబై: న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే బ్రూక్‌ఫీల్డ్ అస్సెట్ మేనేజ్‌మెంట్ భారత మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలనుకుంటోంది. తన నిర్వహణలోని ఆస్తులను (ఏయూఎం) వచ్చే మూడేళ్లలో మూడు రెట్లు పెంచుకుని 100 బిలియన్ డాలర్లకు (రూ.8.5 లక్షల కోట్లు సుమారు) చేర్చే లక్ష్యంతో ఉన్నట్టు ప్రకటించింది. అంతర్జాతీయంగా తమ ఏయూఎం వచ్చే ఐదేళ్లలో ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని సంస్థ ప్రెసిడెంట్ కానర్ టెస్కే తెలిపారు.
ఇదే సమయంలో భారత్ తదితర వర్ధమాన మార్కెట్లలో వృద్ధి మరింత అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. భారత్‌లో ఇన్‌ఫ్రా, రియల్ ఎస్టేట్, పునరుత్పాదక ఇంధన రంగాల్లో బ్రూక్‌ఫీల్డ్ ప్రస్తుతం 30 బిలియన్ డాలర్ల ఆస్తులను నిర్వహిస్తుండడం గమనార్హం. వచ్చే ఐదేళ్లలో నిర్వహణ ఆస్తులను మూడు లేదా నాలుగింతలు చేసుకోగలమన్న అంచనాతో ఉన్నట్టు టెస్కే చెప్పారు. భారత జీడీపీ వృద్ధి 5.5 శాతానికి పడిపోయినా తమ ఆస్తులపై ఎలాంటి ప్రభావం ఉండబోదన్నారు. భారత్ మాదిరి ఆర్థిక వ్యవస్థకు అది మెరుగైన రేటే అవుతున్నారు.
విలీనాలు.. కొనుగోళ్లు..
ప్రధానంగా విలీనాలు, కొనుగోళ్ల రూపంలో భారత్‌లోని తమ నిర్వహణ ఆస్తులు పెంచుకోనున్నట్టు కానర్ టెస్కే తెలిపారు. అదే సమయంలో ప్రస్తుత వ్యాపార వృద్ధిపైనా దృష్టి సారిస్తామని చెప్పారు. భారత్ వేగంగా మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించిందని చెబుతూ.. స్థిరమైన సరఫరా వ్యవస్థల కోసం చూసే కంపెనీలకు గమ్యస్థానం అవుతుందన్నారు.
మౌలిక సదుపాయాలపై అధిక వ్యయాలు చేస్తుండడంతో ఈ రంగంలో తమ కార్యకలాపాలను మరింత బలోపేతం చేసుకోగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్‌లో పెట్టుబడులపై రాబడులు తమ అంచనాలకు అనుగుణంగా లేదా అంతకుమించే ఉన్నట్టు టెస్కే తెలిపారు. బ్రూక్‌ఫీల్డ్ నిర్వహణ ఆస్తుల్లో 12 బిలియన్ డాలర్లు ఇన్‌ఫ్రాలో, మరో 12 బిలియన్ డాలర్నలు రియల్ ఎస్టేట్‌లో ఉండగా.. పునరుత్పాదక ఇంధన రంగంలో 3 బిలియన్ డాలర్లు, ప్రైవేటు ఈక్విటీలో 3.6 బిలియన్ డాలర్ల మేర నిర్వహిస్తోంది. యూఎస్ అనుసరిస్తున్న టారిఫ్‌ల విధానంతో భారత్‌కు ఎక్కువ ప్రయోజనకరమని టెస్కే అభిప్రాయపడ్డారు.