
బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు ఆధార్ తప్పనిసరి అనేలా బ్యాంకులు పట్టుబట్టకూడదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఆధార్ వాడకం ప్రజల స్వచ్ఛంద నిర్ణయంగా ఉండాలని తెలిపింది. బ్యాంకింగ్ వంటి సేవలకు ఆధార్‌ను తప్పనిసరి చేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం గోప్యత ప్రాథమిక హక్కును ఉల్లంఘించడమేనని జస్టిస్ కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (2018) కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును ఉటంకిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ఆధార్ వివరాలు లేవనే కారణంతో ఖాతా తెరవడంలో జాప్యం చేసిన బ్యాంకుకు, ఓ కంపెనీకి మధ్య తలెత్తిన వివాదం కారణంగా ఈ తీర్పు వెలువడింది. కంపెనీ ప్రత్యామ్నాయంగా నో యువర్ కస్టమర్(కేవైసీ) పత్రాలను అందించినప్పటికీ బ్యాంకు ఆధార్ కోసం పట్టుబట్టింది. ఫలితంగా కొంతకాలం బ్యాంకు ఖాతా తెరవడం ఆలస్యం అయింది. ఇది కంపెనీ నిర్వహణ అంతరాయాలకు, ఆర్థిక నష్టానికి దారితీసిందని సంస్థ పేర్కొంది.
బ్యాంకు చర్యలు చట్టవిరుద్ధం..
బ్యాంకు చర్యలు చట్టవిరుద్ధమని బాంబే హైకోర్టు అభిప్రాయపడింది. కేవైసీ ధ్రువీకరణ కోసం ఆధార్‌ను స్వచ్ఛందంగా ఇవ్వగలిగినప్పటికీ, దాన్ని తప్పనిసరి చేయకూడదని నొక్కి చెప్పింది. పుట్టస్వామి కేసులో సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తూ ఆధార్ వినియోగం నిర్దిష్ట ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సబ్సిడీలకే పరిమితమని మరోసారి స్పష్టం చేసింది. చట్టసభల మద్దతు లేకుండా ప్రైవేటు సేవలకు దీన్ని తప్పనిసరి చేయకూడదని పేర్కొంది.
The Bombay High Court has held that a bank could not have insisted on Aadhaar as a mandatory requirement for opening a bank account after the Supreme Court's verdict in Justice K.S. Puttaswamy v. Union of India (2018), and awarded ₹50,000 in compensation to a company whose… pic.twitter.com/aHDMMKuat3
— Live Law (@LiveLawIndia) July 2, 2025
ఇదీ చదవండి: భారత్‌లో ‘యాపిల్’కు చెక్ పెట్టేలా చైనా కుతంత్రాలు
నష్టపరిహారం చెల్లింపు
ఖాతా తెరిచేందుకు జాప్యం జరిగిన కారణంగా కంపెనీ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడినట్లు సంస్థ తరఫు న్యాయవాది వాదించారు. దీన్ని గుర్తించిన బాంబే హైకోర్టు రూ.50,000 నష్టపరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది. కేవైసీ నిబంధనలు చట్టానికి, రాజ్యాంగానికి అనుగుణంగా ఉండాలని ఈ తీర్పు ఆర్థిక సంస్థలకు గుర్తు చేస్తోంది. ప్రత్యేకించి ప్రత్యామ్నాయ, చట్టబద్ధంగా ఆమోదయోగ్యమైన డాక్యుమెంటేషన్ అందించినప్పుడు కస్టమర్ ఐడెంటిఫికేషన్ ప్రక్రియలు ప్రాథమిక హక్కులను ఉల్లంఘించకూడదని తెలుపుతుంది.