
300 మంది నిపుణులు వెనక్కి
భారతదేశం గ్లోబల్ ఐఫోన్ తయారీ కేంద్రంగా ఎదగడాన్ని డ్రాగన్ దేశం జీర్ణించుకోలేకపోతుంది. ఎలాగైనా భారత్ వృద్ధి ఆపాలనే వక్రబుద్ధితో ఇండియాలో పని చేస్తున్న నైపుణ్యాలు కలిగిన టెక్నీషియన్లను తిరిగి చైనా వెనక్కి పిలిపించుకుంటోంది. యాపిల్ తర్వలో ఐఫోన్ 17ను విడుదల చేయనున్న నేపథ్యంలో ఈమేరకు ఫోన్ల తయారీలో భారత్ గ్లోబల్ హబ్‌గా మారకుండా చైనా కుంతంత్రాలు చేస్తోంది.
గత రెండు నెలల్లో భారత్‌లో యాపిల్ ఉత్పత్తులు తయారు చేస్తున్న ఫాక్స్‌కాన్ తన భారతీయ ప్లాంట్ల నుంచి 300 మందికి పైగా చైనా ఇంజినీర్లను, సాంకేతిక నిపుణులను వెనక్కి పిలిపించింది. ఈ చర్యలకు చైనా కారణమని కొందరు నిపుణులు విశ్వసిస్తున్నారు. యాపిల్ సరఫరా గొలుసుపై ప్రభావం చూపేందుకు, భారత్ ఎగుమతులకు చెక్ పెట్టేలా బీజింగ్ చేసిన రహస్య వ్యూహాత్మక చర్యగా దీన్ని పరిగణిస్తున్నారు.
అసలేం జరిగిందంటే..
యాపిల్ అతిపెద్ద తయారీ భాగస్వామి ఫాక్స్‌కాన్ దక్షిణ భారతదేశంలో కొత్త ఐఫోన్ అసెంబ్లింగ్ ప్లాంట్‌ను నిర్మిస్తోంది. ఇందులో చైనీస్ ఇంజినీర్లు ప్రొడక్షన్ లైన్లను ఏర్పాటు చేయడానికి, భారతీయ సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు, యాపిల్ కఠినమైన నాణ్యతా ప్రమాణాలను నిర్వహించడానికి కీలకంగా వ్యవహరిస్తున్నారు. త్వరలో యాపిల్ ఐఫోన్ 17ను లాంచ్ చేయనుంది. ఈమేరకు భారత్‌లో ఉత్పత్తి పెంచాలని చూస్తోంది. ఈ సమయంలో చైనా ఫాక్స్‌కాన్‌పై ఒత్తిడి తెచ్చి రెండు నెలల వ్యవధిలో ఇక్కడి ప్లాంట్లలో పని చేస్తున్న 300 చైనా నిపుణులను వెనక్కి పిలిపించింది. కేవలం సహాయక సిబ్బందిని మాత్రమే భారత్ సైట్‌ల్లో ఉంచుతుంది.
ఇదీ చదవండి: ‘సీఎం వ్యాఖ్యలు పూర్తి అవాస్తవాలు’
ఈమేరకు ఆగ్నేయాసియా దేశాలకు అత్యాధునిక పరికరాలు, నైపుణ్యం కలిగిన కార్మికుల ఎగుమతులను పరిమితం చేయాలని చైనా కంపెనీలకు మౌఖికంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ చర్య 2026 నాటికి చాలా వరకు అమెరికాకు చెందిన ఐఫోన్ ఉత్పత్తిని భారతదేశానికి తరలించాలన్న యాపిల్ లక్ష్యానికి సవాలుగా మారుతుంది.