
ఢిల్లీ: మన దేశంలో ఆధార్ కార్డుల విషయమై భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) సంచలన వ్యాఖ్యలు చేసింది. దేశంలో కోట్ల మంది చనిపోయినప్పటికీ వారి ఆధార్ కార్డులు యాక్టివ్‌గానే ఉన్నాయని ఉడాయ్ తెలిపింది. వాటిలో కేవలం 10 శాతం కార్డులను మాత్రమే డీయాక్టివేట్ చేస్తున్నట్టు వెల్లడించింది. దీని వల్ల ఆధార్ నంబర్లు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆధార్ కార్డుల విషయమై.. జాతీయ మీడియా ‘ఇండియా టుడే’ దాఖలు చేసిన సమాచార హక్కు (RTI) దరఖాస్తు నేపథ్యంలో ఉడాయ్ సమాధానం ఇచ్చింది. ఈ క్రమంలో కీలక విషయాలను బయటపెట్టింది. ఈ సందర్భంగా ఉడాయ్.. దేశంలో గత 14 సంవత్సరాల్లో సుమారు 11.7 కోటి మంది మరణించినప్పటికీ కేవలం 1.15 కోట్ల ఆధార్ నంబర్లను మాత్రమే డీయాక్టివేట్ చేసిందని తెలిపింది. ఇది దేశ మరణాల రేటుతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది.
అయితే, సిటిజన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (సీఆర్ఎస్) డేటా ప్రకారం.. 2007 నుంచి 2019 వరకు సంవత్సరానికి సగటున 83.5 లక్షల మరణాలు చోటుచేసుకుంటున్నాయి. అయినప్పటికీ 10 శాతం కార్డులను మాత్రమే డీయాక్టివేట్ చేస్తున్నారు. ఈ ప్రక్రియ మరణ ధ్రువీకరణ పత్రం, కుటుంబ సభ్యులు ఇచ్చే సమాచారం ఆధారంగా జరుగుతుందని ఉడాయ్ వెల్లడించింది.
🚨 RTI Shocker on Aadhaar Deactivation
🔹 11.7 crore deaths in India in last 14 years
🔹 But UIDAI deactivated only 1.15 crore Aadhaar numbers
🔹 Raises serious concerns on data accuracy
🔹 Big risk of misuse & fraud
🔹 Aadhaar update system under scanner #Aadhaar #Uidai pic.twitter.com/LQ8uEmnujL— Sood Saab (@SoodSaab11) July 16, 2025
ఇదే సమయంలో గత ఐదు సంవత్సరాల్లో సంవత్సరం వారీగా ఎన్ని ఆధార్ నంబర్లు మరణాల ఆధారంగా డీయాక్టివేట్ చేయబడ్డాయని ఆర్టీఐ ద్వారా అడిగినప్పుడు.. అటువంటి సమాచారం తమ వద్ద లేదు అని యూఐడీఏఐ సమాధానమిచ్చింది. డిసెంబర్ 31, 2024 నాటికి మరణాల ఆధారంగా మొత్తం 1.15 కోట్ల ఆధార్ నంబర్లు డీయాక్టివేట్ చేయబడ్డాయని మాత్రమే యూఐడీఏఐ తెలిపింది. ఈ అసమానత ఆధార్ వ్యవస్థలో మరణాల రిజిస్ట్రేషన్, డీయాక్టివేషన్ ప్రక్రియలో లోపాలను ఎత్తిచూపుతున్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే, ఆధార్ నంబర్లు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.