
న్యూఢిల్లీ: గత ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్ర దాడిపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్‌ఐఏ)ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. ఈ నేపధ్యంలో పలు విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఘటనా స్థలంలో ఒక వ్యక్తిని ఉగ్రవాదులు ‘కల్మా’ పఠించాలని అడిగి, అతను అలా చేయగానే వదిలివేసినట్లు ఎన్‌ఐఏ విచారణలో తేలింది.
దాడి అనంతం ఉగ్రవాదులు పారిపోతూ, గాలిలో కాల్పులు జరిపారని, భాధితులకు ఎవరూకూడా సాయం అందించకుండా ఉండేందుకే ఇలా చేసివుంటారని ఎన్‌ఐఏ వర్గాలు భావిస్తున్నాయి. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన పర్వైజ్ అహ్మద్, బషీర్ అహ్మద్‌ల విచారణలో.. ఉగ్రవాదులు అక్కడి నుంచి తప్పించుకుంటున్నప్పుడు గాలిలో కాల్పులు జరిపారని వెల్లడయ్యింది.
కాల్పులు జరిగిన ప్రదేశం నుండి ఎన్‌ఐఏ ఖాళీ బుల్లెట్లను స్వాధీనం చేసుకుంది. ఉగ్రవాదులు ఈ ఘటనకు ముందు అక్కడున్నవారి మతాన్ని తెలుసుకునేందుకు కల్మా చదవమన్నారని ప్రాణాలతో బయటపడిన వారు ఎన్‌ఐఏ అధికారులకు తెలిపారు. ఎన్‌ఐఏ ఇప్పటివరకూ లభ్యమైన ఆధారాల మేరకు ముగ్గురు ఉగ్రవాదులలో ఒకరిని పాకిస్తాన్‌కు చెందిన హషీమ్ ముసాగా గుర్తించింది. మిగిలిన ఇద్దరినీ గుర్తించేందుకు ప్రయత్నిస్తోంది. అయితే వీరు పహల్గామ్ దాడి కోసం భారత్‌లోనికి చొరబడినట్లు అనుమానిస్తున్నారు.