
కేంద్రానికి ఐసీఈఏ విజ్ఞప్తి
మొబైల్ ఫోన్లు, పరికరాలను, నిత్యావసర ఉత్పత్తుల కోసం ఉద్దేశించిన 5 శాతం జీఎస్‌టీ శ్లాబ్‌లో చేర్చాలని కేంద్రానికి ఇండియా సెల్యూలార్ అండ్ ఎల్రక్టానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం అమలు చేస్తున్న 18 శాతం జీఎస్‌టీ తిరోగమన విధానమని పేర్కొంది. నాలుగు శ్లాబులుగా ఉన్న జీఎస్‌టీ రేట్లను రెండింటికి తగ్గించేలా కేంద్రం ప్రతిపాదనలు చేసిన నేపథ్యంలో ఐసీఈఏ విజ్ఞప్తి ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రస్తుతం మొబైల్ ఫోన్లనేవి విలాస వస్తువులుగా గాకుండా విద్య, వైద్యం, ఆర్థిక సమ్మిళితత్వం, గవర్నెన్స్‌కి సంబంధించి అత్యవసర డిజిటల్ మౌలిక సదుపాయాలకు కీలకంగా మారాయని ఐసీఈఏ చైర్మన్ పంకజ్ మహీంద్రు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్ వ్యవస్థను 500 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలన్న లక్ష్యానికి అనుగుణంగా మొబైల్స్‌ను అయిదు శాతం జీఎస్‌టీలో చేర్చాలని కోరారు.
జీఎస్‌టీ ప్రవేశపెట్టడానికి ముందు చాలా రాష్ట్రాలు మొబైల్ ఫోన్లను నిత్యావసర ఉత్పత్తులుగా గుర్తించి, వాటిపై 5 శాతం వ్యాట్ (విలువ ఆధారిత పన్ను) మాత్రమే విధించాయని మహీంద్రూ చెప్పారు.
ఇదీ చదవండి: అల్ట్రాటెక్ 200 ఎంటీపీఏ సామర్థ్యం
అయితే, జీఎస్‌టీని ప్రవేశపెట్టాక ముందు 12 శాతం శ్లాబ్‌లో ఉంచి ఆ తర్వాత 2020లో 18 శాతానికి మార్చారని మహీంద్రూ గుర్తు చేశారు. దీనితో అందుబాటు ధరల్లో మొబైల్స్ లభ్యతపైనా, అమ్మకాల పరిమాణంపైనా ప్రతికూల ప్రభావం పడిందని చెప్పారు. మొబైల్స్ వార్షిక వినియోగం 30 కోట్ల యూనిట్ల నుంచి 22 కోట్లకు తగ్గిపోయిందని వివరించారు. కాబట్టి వీటిని అయిదు శాతం శ్లాబ్‌లోకి చేర్చడాన్ని మినహాయింపుగా భావించరాదని, కరెక్షన్‌గా పరిగణించాలని మహీంద్రూ చెప్పారు. 2015 ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా రూ. 18,900 కోట్లుగా ఉన్న మొబైల్ ఫోన్ల ఉత్పత్తి 2025 ఆర్థిక సంవత్సరంలో రూ. 5.45 లక్షల కోట్లకు చేరింది.