
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే అధిగమిస్తాం
కంపెనీ ఛైర్మన్ కుమార మంగళం బిర్లా
అల్ట్రాటెక్ సిమెంట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 200 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి (ఎంటీపీఏ) సామర్థ్యాన్ని అధిగమిస్తుందని కంపెనీ చైర్మన్ కుమార మంగళం బిర్లా ప్రకటించారు. దీంతో చైనా వెలుపల ప్రపంచంలోనే అతిపెద్ద సిమెంట్ విక్రయ కంపెనీగా అవతరిస్తుందన్నారు. కంపెనీ వార్షిక సమావేశంలో వాటాదారులను ఉద్దేశించి మాట్లాడారు.
ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో జీడీపీ 7.4 వృద్ధి రేటు సాధించడం వెనుక నిర్మాణరంగం, తయారీ రంగం కీలక పాత్ర ఉన్నట్టు చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో భారత్ 6.5 శాతం వృద్ధి రేటుతో ప్రపంచంలో వేగంగా ప్రగతి సాధిస్తున్న ఆర్థిక వ్యవస్థగా ఉన్నట్టు గుర్తు చేశారు. ఇక ముందూ బలమైన వృద్ధిని కొనసాగిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇందులో 16.3 ఎంటీపీఏ సామర్థ్యాన్ని సొంతంగా ఏర్పాటు చేసుకోగా, ఇండియా సిమెంట్స్, కేశోరామ్ సిమెంట్స్ కొనుగోళ్ల రూపంలో 26.3 ఎంటీపీఏ సామర్థ్యం సమకూర్చుకున్నట్టు కుమార మంగళం బిర్లా తెలిపారు. దీంతో 2025 మార్చి నాటికి మొత్తం సామ ర్థ్యం 188.8 ఎంటీపీఏకు చేరుకున్నట్టు చెప్పారు. ఇక ఈ ఏడాది జూన్ క్వార్టర్‌లో 3.5 ఎంటీపీఏ గ్రే సిమెంట్ సామర్థ్యం తోడు కావడంతో ఇది 192.26 ఎంటీపీఏకు చేరుకున్నట్టు తెలిపారు.
ఇదీ చదవండి: ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుపై కేంద్ర హోం మంత్రికి లేఖ
నిర్మాణ రంగం నుంచి డిమాండ్
గతిశక్తి తదితర మౌలిక రంగ ప్రాజెక్టులు, ఇళ్ల పథకాలకు ప్రభుత్వం అధిక కేటాయింపులు చేస్తుండడంతో నిర్మాణ రంగం బలమైన పనితీరు చూపించనున్నట్టు కుమార మంగళం తెలిపారు. ప్రస్తుతం కంపెనీ నిర్వహణలో 34 ఇంటెగ్రేడెడ్ యూనిట్లు, 30 గ్రైండింగ్ యూనిట్లు, 9 బల్క్ టెర్మినళ్లు ఉన్నాయని వివరిస్తూ.. ఈ స్థాయి సామర్థ్యంతో దేశ డిమాండ్ అవసరాలను తీర్చగలమని చెప్పారు.