
తగ్గనున్న ప్రాజెక్టుల వ్యయం
నిర్మాణం వేగవంతం
ప్రభుత్వ నిర్ణయంతో పరిశ్రమలో ఉత్సాహం
న్యూఢిల్లీ: సిమెంట్‌పై జీఎస్‌టీ రేటు తగ్గింపు మౌలిక రంగ ప్రాజెక్టులపై వ్యయ భారాన్ని తగ్గించనుంది. దీనివల్ల నగదు ప్రవాహాలు మెరుగుపడతాయని నిర్మాణ రంగ కంపెనీలు అభిప్రాయపడుతున్నాయి. మౌలిక రంగ ప్రాజెక్టుల నిర్మాణంలో సిమెంట్ కీలక ముడిపదార్థం అన్న విషయం విదితమే. ప్రస్తుతం సిమెంట్‌పై 28% జీఎస్‌టీ అమల్లో ఉండగా, దీన్ని 18 శాతానికి తగ్గిస్తూ జీఎస్‌టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఈ నెల 22 నుంచి అమల్లోకి రానుండడం గమనార్హం. ప్రభుత్వ నిర్ణయంతో పరిశ్రమలో ఉత్సాహం నెలకొంది. తమ నగదు ప్రవాహాలు మెరుగుపడతాయని ఇన్‌ఫ్రా కంపెనీలు పేర్కొన్నాయి.
ఆర్థిక వృద్ధికి ప్రేరణ...
‘‘నిర్మాణంలోకి వినియోగించే కీలక ముడిపదార్థం అయిన సిమెంట్‌పై జీఎస్‌టీని తగ్గించాలన్నది చరిత్రాత్మక నిర్ణయం. రేట్ల క్రమబద్దీకరణ మౌలిక వసతుల అభివృద్ధికి, ఆర్థిక వృద్ధికి ప్రేరణనిస్తుంది’’అని పటేల్ ఇంజనీరింగ్ ఎండీ కవితా శివకుమార్ తెలిపారు. కీలక ముడిపదార్థంపై పన్ను తగ్గించడం రహదారుల రంగానికి ఊతం లభిస్తుందని ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ పేర్కొంది. నిర్మాణ వ్యయాలను తగ్గిస్తుందని, తద్వారా నగదు ప్రవాహాలు పెరుగుతాయని, డెవలపర్ల ఆరి్థక పరిస్థితి బలోపేతం అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది.
సకాలంలో ప్రాజెక్టుల నిర్మాణం
కేఈసీ ఇంటర్నేషనల్ ఎండీ విమల్ కేజ్రీవాల్ సైతం ఇదే విధమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. సిమెంట్‌పై జీఎస్‌టీ తగ్గింపుతో మూలధన నిధుల పరమైన వెసులుబాటు లభిస్తుందని (తక్కువ కేటాయింపులు), నగదు ప్రవాహాలు మెరుగుపడతాయన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం సకాలంలో పూర్తి అవుతాయని పేర్కొన్నారు. మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం పెడుతున్న ప్రత్యేక శ్రద్ధకు తోడు రేట్ల తగ్గింపుతో ప్రైవేటు మూలధన వ్యయాలకు ప్రేరణ లభిస్తుందని, ఈ రంగంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడం సాధ్యపడుతుందన్నారు.
ప్రాజెక్టుల నిర్మాణం జాప్యంలో నిధుల పరమైన అవసరాలు కూడా ఒక కారణంగా ఉంటుండడం గమనార్హం. నిర్మాణంలోకి వినియోగించే కీలక ముడి పదార్థాలపై జీఎస్‌టీ తగ్గించం వల్ల తయారీ వ్యయాలు గణనీయంగా తగ్గుతాయని, దీంతో ప్రాజెక్టుల నిర్మాణం వేగం పుంజుకుంటుందని యాక్షన్ కన్‌స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్ లిమిటెడ్ (ఏసీఈ) ఈడీ సోరభ్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు.
వ్యవసాయ రంగం పరికరాలపై పన్ను రేటును 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించడాన్ని చరిత్రాత్మక నిర్ణయంగా అభివరి్ణంచారు. దీనివల్ల రైతులకు, ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం కలుగుతుందన్నారు. ‘‘ప్రాజెక్టుల నిర్మాణ వ్యయంలో 40–45 శాతం సిమెంట్ స్టీల్ కోసమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. జీఎస్‌టీ రేటు మార్పుతో పన్ను భారం 10 శాతం మేర తగ్గుతుంది. దీంతో ప్రాజెక్టుల నిర్మాణం లాభదాయకంగా మారుతుంది. నిర్మాణం వేగవంతం అవుతుంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యానికి ఊతం లభిస్తుంది’’ అని రోడిక్ డిజిటల్ అండ్ అడ్వైజరీ ఎండీ నాగేంద్ర నాథ్ సిన్హా పేర్కొన్నారు.