breaking news
Cash Flows
-
సిమెంట్‌పై జీఎస్టీ కోత.. మౌలిక రంగానికి బూస్ట్!
న్యూఢిల్లీ: సిమెంట్‌పై జీఎస్టీ రేటు తగ్గింపు మౌలిక రంగ ప్రాజెక్టులపై వ్యయ భారాన్ని తగ్గించనుంది. దీనివల్ల నగదు ప్రవాహాలు మెరుగుపడతాయని నిర్మాణ రంగ కంపెనీలు అభిప్రాయపడుతున్నాయి. మౌలిక రంగ ప్రాజెక్టుల నిర్మాణంలో సిమెంట్ కీలక ముడిపదార్థం అన్న విషయం విదితమే. ప్రస్తుతం సిమెంట్‌పై 28% జీఎస్టీ అమల్లో ఉండగా, దీన్ని 18 శాతానికి తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఈ నెల 22 నుంచి అమల్లోకి రానుండడం గమనార్హం. ప్రభుత్వ నిర్ణయంతో పరిశ్రమలో ఉత్సాహం నెలకొంది. తమ నగదు ప్రవాహాలు మెరుగుపడతాయని ఇన్ఫ్రా కంపెనీలు పేర్కొన్నాయి.ఆర్థిక వృద్ధికి ప్రేరణ...‘‘నిర్మాణంలోకి వినియోగించే కీలక ముడిపదార్థం అయిన సిమెంట్‌పై జీఎస్టీని తగ్గించాలన్నది చరిత్రాత్మక నిర్ణయం. రేట్ల క్రమబద్దీకరణ మౌలిక వసతుల అభివృద్ధికి, ఆర్థిక వృద్ధికి ప్రేరణనిస్తుంది’’అని పటేల్ ఇంజనీరింగ్ ఎండీ కవితా శివకుమార్ తెలిపారు. కీలక ముడిపదార్థంపై పన్ను తగ్గించడం రహదారుల రంగానికి ఊతం లభిస్తుందని ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ పేర్కొంది. నిర్మాణ వ్యయాలను తగ్గిస్తుందని, తద్వారా నగదు ప్రవాహాలు పెరుగుతాయని, డెవలపర్ల ఆరి్థక పరిస్థితి బలోపేతం అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. సకాలంలో ప్రాజెక్టుల నిర్మాణం కేఈసీ ఇంటర్నేషనల్ ఎండీ విమల్ కేజ్రీవాల్ సైతం ఇదే విధమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. సిమెంట్‌పై జీఎస్టీ తగ్గింపుతో మూలధన నిధుల పరమైన వెసులుబాటు లభిస్తుందని (తక్కువ కేటాయింపులు), నగదు ప్రవాహాలు మెరుగుపడతాయన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం సకాలంలో పూర్తి అవుతాయని పేర్కొన్నారు. మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం పెడుతున్న ప్రత్యేక శ్రద్ధకు తోడు రేట్ల తగ్గింపుతో ప్రైవేటు మూలధన వ్యయాలకు ప్రేరణ లభిస్తుందని, ఈ రంగంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడం సాధ్యపడుతుందన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం జాప్యంలో నిధుల పరమైన అవసరాలు కూడా ఒక కారణంగా ఉంటుండడం గమనార్హం. నిర్మాణంలోకి వినియోగించే కీలక ముడి పదార్థాలపై జీఎస్టీ తగ్గించం వల్ల తయారీ వ్యయాలు గణనీయంగా తగ్గుతాయని, దీంతో ప్రాజెక్టుల నిర్మాణం వేగం పుంజుకుంటుందని యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ లిమిటెడ్ (ఏసీఈ) ఈడీ సోరభ్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. వ్యవసాయ రంగం పరికరాలపై పన్ను రేటును 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించడాన్ని చరిత్రాత్మక నిర్ణయంగా అభివరి్ణంచారు. దీనివల్ల రైతులకు, ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం కలుగుతుందన్నారు. ‘‘ప్రాజెక్టుల నిర్మాణ వ్యయంలో 40–45 శాతం సిమెంట్ స్టీల్ కోసమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. జీఎస్టీ రేటు మార్పుతో పన్ను భారం 10 శాతం మేర తగ్గుతుంది. దీంతో ప్రాజెక్టుల నిర్మాణం లాభదాయకంగా మారుతుంది. నిర్మాణం వేగవంతం అవుతుంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యానికి ఊతం లభిస్తుంది’’ అని రోడిక్ డిజిటల్ అండ్ అడ్వైజరీ ఎండీ నాగేంద్ర నాథ్ సిన్హా పేర్కొన్నారు. -
ఇక.. బ్యాంకు చెల్లింపులు
ఉపాధికూలీల వేతనాల పంపిణీ ♦ త్వరలో ఈ ప్రక్రియ ప్రారంభానికి కసరత్తు ♦ ఖాతాలు లేనివారికి తెరిపించాలని ప్రభుత్వం ఆదేశాలు ♦ ఉన్నవారికి ఆధార్ అనుసంధానించాలని సూచన ♦ అవకతవకలు తగ్గుతాయని సర్కార్ ఉద్దేశం ♦ జిల్లాలో 1,84,934 జాబ్‌కార్డులు ♦ 18 మండలాల్లో 4,29,951 మంది కూలీలు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలకు ఇకపై బ్యాంకుల ద్వారానే కూలి డబ్బులు చెల్లించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇప్పటివరకు కొన్ని చోట్ల పోస్టాఫీసుల ద్వారా డబ్బులు చెల్లిస్తున్నారు. ఈ ప్రక్రియకు త్వరలో స్వస్తి చెప్పనున్నారు. కూలీలందరికీ బ్యాంకుల్లో ఖాతాలు తప్పనిసరిగా ఉండాలని డీఆర్డీఓకు గ్రామీణాభివృద్ధి శాఖ సూచించింది. అదే విధంగా ఖాతాలకు ఆధార్ నంబర్‌ను అనుసంధానించాలని పేర్కొంది. దీంతో దాదాపు పదిహేనేళ్ల నుంచి పోస్టాఫీసుల ద్వారా డబ్బులు చెల్లించే ప్రక్రియకు త్వరలో రాంరాం చెప్పనుంది. బ్యాంకుల ద్వారా చెల్లింపులు జరిపితే ఎలాంటి అక్రమాలు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే డబ్బులు జమ అవుతాయని భావించి ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. సాక్షి, వికారాబాద్: ఒకప్పుడు డబ్బుల చెల్లింపునకు ప్రభుత్వం పోస్టాఫీసులపైనే ఆధారపడేది. కోర్ బ్యాంకింగ్ సిస్టమ్, ఆన్లైన్ విధానం, ఏటీఎం కార్డుల జారీ ప్రక్రియ వంటివి బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రవేశపెట్టినప్పటినుంచి సర్కార్ అన్ని శాఖల చెల్లింపులన్నీ దాదాపుగా బ్యాంకుల ద్వారానే జరుపుతున్నాయి. పోస్టాఫీసుల ద్వారా ఉపాధి డబ్బులు చెల్లిస్తే లబ్ధిదారు స్వయంగా వెళ్లి తీసుకోవాల్సి వచ్చేది. అదే బ్యాంకుల్లో అయితే ఏటీఎం కార్డుల ద్వారా ఎక్కడంటే అక్కడ ఎప్పుడంటే అప్పుడు తీసుకునే వీలుంది. పోస్టాఫీసుల ద్వారా చెల్లింపులు జరిపినప్పుడు కొన్నిసార్లు అవకతవకలు, అక్రమాలు జరిగినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం పోస్టాఫీసుల ద్వారా చెల్లింపునకు పూర్తిగా స్వస్థి పలకాలని నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని 26 గ్రామ పంచాయతీల్లో వికారాబాద్ జిల్లా 18 మండలాలలో ఏర్పడింది. లక్షా 84వేల 934 జాబ్‌కార్డులు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా మొత్తం 4లక్షల 29వేల 951 మంది ఉపాధి కూలీలు ఉన్నారు. అయితే, వీరిలో రెగ్యులర్‌గా ఉపాధి పనులకు వచ్చేవారు 3 లక్షల 5వేల మంది మాత్రమే. జిల్లా ఏర్పాటు సమయంలో మహబూబ్‌నగర్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గం నుంచి కొడంగల్, దౌల్తాబాద్, బొంరాస్‌పేట్ మండలాలను విలీనం చేశారు. దీంతో ఈ మండలాల పరిధిలోని 26 గ్రామ పంచాయతీల్లో నేటికీ పోస్టాఫీసుల ద్వారానే ఉపాధి కూలీలకు వేతనాలు చెల్లిస్తున్నారు. కొడంగల్ మండలంలో 10,764 జాబ్‌కార్డులు.. 27,950 మంది కూలీలు, దౌల్తాబాద్ మండలంలో 12,470 జాబ్‌కార్డులుండగా, 33 569 మంది పనిచేస్తున్నారు. బొంరాస్‌పేట మండలంలో 13,839 జాబ్‌కార్డులకు 31,230 మంది ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ మూడు మండలాల్లో పనిచేసే ఉపాధికూలీలకు బ్యాంకు ఖాతాలు తెరిపించాలని ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ గ్రామీణాభివృద్ధి అధికారులను ఆదేశించారు. దీంతోపాటు జిల్లాలోని అన్ని మండలాల్లో ఉపాధికూలీల బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ను అనుసంధానించాలని సూచించారు. కూలీల బ్యాంకు ఖాతాలు, ఉపాధిజాబ్కార్డులు, సెల్ఫోన్నెంబర్లను తీసుకొని వాటికి ఆధార్‌కార్డును అనుసంధానించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో కూలీ డబ్బులు నేరుగా కూలీల ఖాతాల్లో జమ చేసేందుకు వీలు కలుగుతుంది. అదేవిధంగా డబ్బుల పంపిణీలో అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా ఉండే విధంగా గ్రామీణాభివృద్ధి అదికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు ఈ పనిని అప్పగించి సెప్టెంబరు నెలాఖరులోగా బ్యాంకు ఖాతాలు తెరిపించడానికి అధికారులు కసరత్తు వేగిరం చేశారు. వచ్చే నెలాఖరులోపు పూర్తిచేస్తాం బ్యాంకుల ద్వారానే ఉపాధి కూలీలకు కూలీ డబ్బులు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రతి కూలీకి బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటివరకు జిల్లాలోని కొడంగల్, బొంరాస్‌పేట్, దౌల్తాబాద్ మండలాల్లో పనిచేసే 92,749 మంది ఉపాధి కూలీలు పోస్టాఫీసుల ద్వారానే కూలీ డబ్బులు తీసుకుంటున్నారు. వీరికి వచ్చేనెలలోపు బ్యాంకు ఖాతాలు తెరిపించడానికి చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలోని 4,29,951 మంది కూలీలందరికీ బ్యాంకు ఖాతాలు ఉండి ఆధార్ అనుసంధానం చేయించేందుకు నిర్ణయించాం. మరో రెండుమూడు నెలల్లో పోస్టాఫీసుల ద్వారా ఉపాధిహామీ పథకం కూలీలకు డబ్బులు పంపిణీ చేసే ప్రక్రియకు ప్రభుత్వం పూర్తిగా ముగింపు పలకాలని భావిస్తుంది. ఈక్రమంలోనే కూలీలందరికీ బ్యాంకు ఖాతాలు తెరిపించాలనే ఆదేశాలు ఉన్నాయి. – జాన్సన్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, వికారాబాద్