
ఈరోజు పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం
రియల్ మనీ గేమ్స్‌పై నిషేధం విధించే విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ భారత ఆన్‌లైన్ గేమింగ్ సంస్థలు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశాయి. ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లు-2025ను బుధవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో ఈమేరకు లేఖ రాయడం గమనార్హం. ఇప్పటికే ఈ బిల్లును కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదించింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న ఈ బిల్లులో ఆన్‌లైన్ గేమింగ్ రంగాన్ని నియంత్రించడానికి ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేశారు.
ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ (ఏఐజీఎఫ్), ఈ-గేమింగ్ ఫెడరేషన్ (ఈజీఎఫ్), ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఫాంటసీ స్పోర్ట్స్ (ఎఫ్ఐఎఫ్ఎస్) సంయుక్తంగా కేంద్రం హోం మంత్రికి ఇచ్చిన వినతిపత్రంలో ఆసక్తికర అంశాలు తెలిపారు. ఆన్‌లైన్ స్కిల్ గేమింగ్ విభాగం ఒక ట్రిలియన్ డాలర్ల డిజిటల్ ఎకానమీని సృష్టిస్తుందని చెప్పారు. ‘భారతదేశపు డిజిటల్ గేమింగ్ రంగంలో పనిచేస్తున్న లక్షలాది మంది యువ పారిశ్రామికవేత్తలు, డెవలపర్లు, నిపుణులు కొత్త ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు వల్ల తీవ్రంగా ప్రభావితం చెందుతారు. ఇందులోని నిషేధ నియమాలు చట్టబద్ధమైన, ఉద్యోగాలను సృష్టించే పరిశ్రమను దెబ్బ తీస్తుంది’ అని తెలిపారు.
ప్రస్తుతం ఈ పరిశ్రమ రూ.2 లక్షల కోట్లకు పైగా ఎంటర్‌ప్రైజ్ వాల్యుయేషన్‌ను, రూ.31,000 కోట్ల వార్షిక ఆదాయం, ప్రత్యక్ష, పరోక్ష పన్నుల రూపంలో రూ.20,000 కోట్లకు పైగా ఆదాయాన్ని సమకూరుస్తోందని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. 20 శాతం సీఏజీఆర్‌తో వృద్ధి చెందుతున్న ఈ రంగం 2028 నాటికి రెట్టింపు అవుతుందని అంచనా. భారతదేశంలో ఆన్‌లైన్ గేమర్లు 2020లో 36 కోట్ల నుంచి 2024లో 50 కోట్లకు పెరిగారు. జూన్ 2022 వరకు రూ.25,000 కోట్లకు పైగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆ రంగం ఆకర్షించింది. ఈ పరిశ్రమ ప్రత్యక్షంగా, పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. గేమింగ్, టెక్నాలజీ, డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో ప్రపంచానికి నాయకత్వం వహించే అవకాశం భారత్‌కు ఉందని, నిషేధానికి బదులు ప్రగతిశీల నియంత్రణను అవలంబించాలని లేఖలో ప్రభుత్వాన్ని కోరారు.
ఇదీ చదవండి: బంగారం ధరలు యూటర్న్!
ఈ-స్పోర్ట్స్, ఎడ్యుకేషనల్ గేమ్స్, సోషల్ గేమింగ్‌తో సహా ఆన్‌లైన్ గేమింగ్ రంగాన్ని ప్రోత్సహించడానికి, కొన్ని అంశాల్లో నియంత్రించడానికి, వ్యూహాత్మక అభివృద్ధి, నిరంతర పర్యవేక్షణ కోసం ఒక అథారిటీని ఏర్పాటు చేసేలా వీలు కల్పించే బిల్లును బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఆన్‌లైన్ గేమ్స్, ఈ-స్పోర్ట్స్ మధ్య స్పష్టమైన విభజన సూచించేలా బిల్లును రూపొందించారు. నిబంధనల్ని ఉల్లంఘించి ఆన్‌లైన్ గేమ్స్ అందిస్తున్నవారికి మూడేళ్ల వరకు జైలుశిక్ష, లేదా రూ.కోటి వరకు జరిమానా, లేదా ఆ రెండూ విధించాలని బిల్లులో ప్రతిపాదించారు. సంబంధిత అడ్వర్టయిజ్‌మెంట్లలో భాగం పంచుకున్నవారికి గరిష్ఠంగా రెండేళ్ల జైలుశిక్ష, రూ.50 లక్షల వరకు జరిమానా విధిస్తారు. వీటి ఆర్థిక లావాదేవీల్లో ప్రమేయం ఉన్నవారికీ గరిష్ఠంగా మూడేళ్ల శిక్ష, రూ.కోటి వరకు జరిమానా వేస్తారు.