
ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక
వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)లో రెండే పన్ను శ్లాబులతో కూడిన ప్రతిపాదిత సంస్కరణలతో ఆదాయ నష్టం ఏర్పడినప్పటికీ.. అంతిమంగా వినియోగానికి, జీడీపీకి ఊతమిస్తుందని ఎస్‌బీఐ రీసెర్చ్ విభాగం అంచనా వేసింది. జీఎస్‌టీ 5, 12, 18, 28 శాతం శ్లాబులు ఉండగా.. 5, 18 శాతంతోపాటు లగ్జరీ, సిన్ (పొగాకు తదితర) గూడ్స్‌పై 40 శాతం పన్నును కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదించింది. దీనిపై మంత్రుల బృందం అధ్యయనం తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు. రేట్ల తగ్గింపు ఫలితంగా ఆదాయం రూ.85,000 కోట్లు తగ్గుతుందని, అదే సమయంలో వినియోగం రూ.1.98 లక్షల కోట్లు పెరుగుతుందని ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక అంచనా వేసింది.
జీడీపీ కూడా 0.6 శాతం పెరుగుతుందని నివేదిక పేర్కొంది. జీఎస్‌టీ ఆరంభంలో సగటు రేటు 14.4 శాతంగా ఉంటే, 2019 సెప్టెంబర్ నాటికి 11.6 శాతానికి తగ్గిందని.. అది ఇప్పుడు 9.5 శాతానికి దిగిరావచ్చని తెలిపింది. వినియోగం పెరుగుతుండడం ద్రవ్యోల్బణాన్ని ఎగిసేలా చేయదని వివరించింది. నిత్యావసరాలైన ఆహారం, వస్త్రాలపై 12 శాతం రేటు కాస్తా 5 శాతానికి దిగొస్తుందని.. ఈ విభాగంలో రిటైల్ ద్రవ్యోల్బణం 10–15 బేసిస్ పాయింట్లు తగ్గుతుందని తెలిపింది. సేవలకు సంబంధించి ద్రవ్యోల్బణం 5–10 బేసిస్ పాయింట్లు తగ్గుతుందని అంచనా కట్టింది. దీంతో మొత్తం మీద రిటైల్ ద్రవ్యోల్బణం (సీపీఐ) 0.20–0.25 శాతం తగ్గుతుందని తెలిపింది.
ఇదీ చదవండి: ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుపై కేంద్ర హోం మంత్రికి లేఖ
జీడీపీ 1.6 శాతం పెరగొచ్చు..
బడ్జెట్‌లో కల్పించిన ఆదాయపన్ను ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకుని చూస్తే మొత్తం మీద వినియోగం 5.31 లక్షల కోట్లు పెరుగుతుందని.. దీని ఫలితంగా జీడీపీ వృద్ధి 1.6 శాతం అధికమవుతుందని ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక తెలిపింది.