నిఫ్టీకి ‘నూతన’ ఊపు.. 14 నెలలకు ఆల్-టైమ్ హై | Nifty Hits All Time High After 14 Months | Sakshi
Sakshi News home page

Stock Market: నిఫ్టీకి ‘నూతన’ ఊపు.. 14 నెలలకు ఆల్-టైమ్ హై

Nov 27 2025 11:50 AM | Updated on Nov 27 2025 12:26 PM

Nifty Hits All Time High After 14 Months

భారత స్టాక్‌మార్కెట్‌లో గురువారం (నవంబర్‌ 27) కీలక పరిణామం చోటుచేసుకుంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌ (NSE) ప్రధాన బెంచ్‌మార్క్ ఇండెక్స్ అయిన నిఫ్టీ 50 నూతన చరిత్ర సృష్టించింది. 14 నెలల తర్వాత కొత్త ఆల్–టైమ్ గరిష్ట స్థాయిని తాకింది.

సెషన్‌ ప్రారంభంలోనే నిఫ్టీ 50 సూచీ 26,295 పాయింట్లపైకి ఎగబాకి, 2024 సెప్టెంబర్ 27న నమోదైన పూర్వపు రికార్డు 26,277.35 పాయింట్లను అధిగమించింది. నిఫ్టీకి ఈ కొత్త మైలురాయిని చేరుకోవడానికి మొత్తం 287 ట్రేడింగ్ సెషన్లు పట్టింది.

రికార్డు హైకి దోహదం చేసిన అంశాలు

  • స్టాక్ మార్కెట్‌లో కొనుగోలు ధోరణి పెరగడానికి అనేక కారకాలు దోహదం చేశాయి.

  • దేశీయ, అంతర్జాతీయ వడ్డీ రేట్లు కోతపై మార్కెట్ అంచనాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను గణనీయంగా పెంచాయి.

  • కంపెనీల బలమైన క్యూ2 ఫలితాలు, అనేక రంగాల్లో ఆదాయ వృద్ధి ఊపందుకోవడం వల్ల సూచీకి శక్తి లభించింది.

  • మ్యూచువల్ ఫండ్స్, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి భారీ ఇన్‌ఫ్లోలు  కొనసాగాయి.

  • మార్కెట్ వాల్యుయేషన్‌లు కొంత సడలించడంవల్ల కొనుగోలు ఆకర్షణ పెరిగింది.

  • గ్లోబల్ మార్కెట్లలో సానుకూల సెంటిమెంట్, అంతర్జాతీయ ట్రేడ్ & మాక్రో డేటా మెరుగుదల కూడా ప్రభావం చూపాయి.

నిఫ్టీ పరిణామ క్రమం
నిఫ్టీ సూచీ తన ప్రారంభం (1995–96) నుంచి ఇప్పటి వరకు నిర్మాణాత్మకంగా పెరుగుతూ భారీ వృద్ధిని నమోదు చేస్తూ వస్తోంది.

2007లో తొలిసారి 5,000 మార్క్‌ను దాటిన నిఫ్టీ 2017లో 10,000 మార్క్‌ను 2021లో 20,000 మైలురాయిని తాకింది. 2024లో 25,000 మార్క్‌ను అందుకున్న ఈ ఎన్‌ఎస్‌ఈ ఇండెక్స్‌ 2025లో 26,000 మైలురాయిని దాటింది.

నిఫ్టీ సూచీకి 2024 సంవత్సరం అనేక రికార్డులు అందించింది. ఆ ఒక్క ఏడాదిలోనే నిఫ్టీ 59 కొత్త రికార్డు హైలు నమోదు చేసింది.

ఏ స్టాక్స్ మెరిశాయంటే..
తాజా ర్యాలీలో ముఖ్యంగా బ్యాంకింగ్ & ఫైనాన్స్ రంగంలో యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ మెరిశాయి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ & ఇంజనీరింగ్ సెక్టార్‌లో లార్సెన్‌ & టూబ్రో, కన్స్యూమర్ & మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో ఏషియన్‌ పెయింట్స్‌ వంటి స్టాక్స్ ఉత్తమ పనితీరు కనబర్చాయి. ఇతర బ్లూ–చిప్ కంపెనీలు కూడా సానుకూల త్రైమాసిక ఫలితాలు వెలువరించడంతో సూచీకి కొత్త ప్రాణం పోశాయి.

నిపుణుల విశ్లేషణ
మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నిఫ్టీ ప్రస్తుత ర్యాలీ పూర్తిగా ఫండమెంటల్స్ ఆధారిత స్థిరమైన వృద్ధిగా కనిపిస్తోంది. వడ్డీ రేట్లు తగ్గే అవకాశం, ఎఫ్‌ఐఐ రాకల్లో మెరుగుదల, దేశీయ డిమాండ్ పెరుగుదల.. ఇవన్నీ మార్కెట్‌కు మద్దతునిస్తున్నాయి.

ఇకపోతే, అంతర్జాతీయ స్థూల అనిశ్చితులు, డాలర్ బలం, క్రూడ్ ధరల్లో మార్పులు వంటి అంశాలు వచ్చే రోజుల్లో మార్కెట్‌లో అస్థిరతకు దారితీయవచ్చు అని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బ్రోకరేజ్ సంస్థల అంచనాల ప్రకారం.. పాలసీ సడలింపులు, ఆర్థిక వృద్ధి స్థిరంగా కొనసాగితే నిఫ్టీ 2026 నాటికి 30,000 మార్క్‌ను తాకే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement