
యూఎస్ టారిఫ్‌లతో భారత కార్పొరేట్ కంపెనీలకు ప్రత్యక్ష సంబంధం తక్కువేనని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. కాకపోతే ప్రస్తుతం మినహాయింపు పరిధిలో ఉన్న ఫార్మాస్యూటికల్స్, తదితర రంగాలపై భవిష్యత్తులో ఆ వెసులుబాటు తొలగిస్తే ప్రభావం పడొచ్చని అంచనా వేసింది. భారత ఉత్పత్తులపై 25 శాతం టారిఫ్‌లను ప్రస్తుతం యూఎస్ అమలు చేస్తోంది. ఈ నెల 27 నుంచి మరో 25 శాతం టారిఫ్‌లు అమల్లోకి రానున్నాయి.
ఫార్మా, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు మాత్రం వీటి నుంచి మినహాయింపులు ఉన్నాయి. 50 శాతంతో ఆసియాలో భారత్‌పైనే అధిక టారిఫ్‌లు అమలు కానున్నట్టు ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరితే ఈ రిస్క్‌లు తగ్గుతాయని పేర్కొంది. రష్యా చమురును భారత ఆయిల్ కంపెనీలు 30–40 శాతం తక్కువ రేటుకు దిగుమతి చేసుకుంటుండడం వాటి లాభాలకు మద్దతుగా నిలుస్తున్నట్టు వివరించింది. భారత ఐటీ కంపెనీలపై టారిఫ్‌ల కారణంగా ప్రత్యక్ష ప్రభావం తక్కువేనని తేల్చింది. అలాగే, దేశీ మార్కెట్‌పై ప్రధానంగా ఆధారపడే ఆయిల్, గ్యాస్, సిమెంట్, బిల్డింగ్ మెటీరియల్స్, ఇంజినీరింగ్, నిర్మాణ రంగం, టెలికం, యుటిలిటీలపై ప్రభావం ఉండదని తెలిపింది. అమెరికా అధిక టారిఫ్‌లు అలాగే కొనసాగితే భారత వృద్ధి రేటు 2025–26లో 6.5 శాతానికి పరిమితం కావొచ్చని అంచనా వేసింది.
దీర్ఘకాలిక వృద్ధిని టారిఫ్‌లు అడ్డుకోవు
భారత ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలపై యూఎస్ టారిఫ్‌లు ప్రభావం చూపించకపోవచ్చని ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ మరోసారి పునరుద్ఘాటించింది. కొన్ని రోజుల క్రితం కూడా ఇదే విధమైన అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. భారత రేటింగ్‌ను సైతం బీబీబీ మైనస్ నుంచి బీబీబీ స్టెబుల్‌కు అప్‌గ్రేడ్ కూడా చేసింది. ‘రానున్న కాలంలో వృద్ది అవకాశాలు బలోపేతం అవుతాయి. వృద్ధి సగటు 6.8 శాతానికి చేరుతుంది. మౌలిక సదుపాయాలు, అనుసంధానత పెరిగితే, దీర్ఘకాలిక వృద్ది అవకాశాలకు ఉన్న అవరోధాలు తొలగిపోతాయి. దీంతో భారత్ దీర్ఘకాలిక వృద్ధి మరింత బలపడుతుంది’ అని ఎస్‌అండ్‌పీ తన తాజా నివేదికలో వివరించింది.
స్వీయ వినియోగం సానుకూల అంశం
భారత్ ప్రపంచంలో అత్యుత్తమ పనితీరు చూపిస్తున్న ఆర్థిక వ్యవస్థలో ఒకటని పేర్కొంది. గత 3–4 ఏళ్లలో ప్రాంతీయంగా ఇతర దేశాలతో పోల్చి చూస్తే భారత్ మెరుగైన వృద్ధిని నమోదు చేసినట్టు గుర్తు చేసింది. భారత వృద్ధిలో 85 శాతం దేశీయ అంశాలపైనే ఆధారపడి ఉంటుందని, ఎగుమతుల రూపంలో సమకూరేది 15 శాతమేనని తెలిపింది. స్వీయ వినియోగంపై అధికంగా ఆధారపడిన ఆర్థిక వ్యవస్థ కావడం సానుకూల అంశంగా పేర్కొంది. స్వల్పకాలంలో వ్యాపార విశ్వాసంపై ప్రభావం పడినప్పటికీ సానుకూల వృద్ది పథం, సానుకూల
వ్యాపార వాతావరణం అన్నవి.. మధ్య కాలం, దీర్ఘకాలంలో వృద్ధిని నిర్ణయిస్తాయని అభిప్రాయపడింది. ‘భారత జీడీపీలో అమెరికా ఎగుమతుల పాత్ర ఒక శాతమే. టారిఫ్‌లు అధికంగా విధించినప్పటికీ దీర్ఘకాలంలో వృద్ధి అవకాశాలను
ప్రభావితం చేస్తాయని అనుకోవడం లేదు’అని వివరించింది.
ఇదీ చదవండి: ‘నా భార్య నన్ను పిచ్చోడిలా చూసింది’