
సెప్టెంబర్ 30 వరకు అమలు
న్యూఢిల్లీ: దేశీయంగా టెక్స్‌టైల్స్ పరిశ్రమకు కీలక వనరైన ముడి పత్తి దిగుమతులకు సంబంధించి సెప్టెంబర్ 30 వరకు సుంకాల నుంచి మినహాయింపునిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దీనిపై 11 శాతం సుంకాలతో పాటు వ్యవసాయ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి సెస్సు కూడా వర్తిస్తోంది. ఆర్థిక శాఖ నోటిఫికేషన్ ప్రకారం ఈ మినహాయింపు ఆగస్టు 19 నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుంది.
దీనితో భారత్‌కి పత్తిని ఎగుమతి చేసే రెండో అతిపెద్ద సరఫరాదారైన అమెరికాకు ప్రయోజనం చేకూరనుంది. ధరలను స్థిరీకరించడానికి, ముడి సరుకు లభ్యతను మెరుగుపర్చడానికి సుంకాల మినహాయింపు ఉపయోగపడుతుందని జీటీఆర్‌ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. దేశీయంగా పత్తి ధరలు తగ్గిపోయి, రైతులపై ప్రభావం పడకూడదనే ఉద్దేశంతో మినహాయింపులను ప్రభుత్వం 40 రోజులకే పరిమితం చేసినట్లు చెప్పారు. 2024 ఆర్థిక సంవత్సరంలో 579.2 మిలియన్ డాలర్లుగా ఉన్న పత్తి దిగుమతులు 2025 ఆర్థిక సంవత్సరంలో 107 శాతం ఎగిసి 1.20 బిలియన్ డాలర్లకు చేరాయి.