
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాక్సిన్ల తయారీ సంస్థ భారత్ బయోటెక్ కలరా వ్యాక్సిన్ పరీక్షల్లో పురోగతి సాధించింది. 1800 మందిపై నిర్వహించిన మూడో దశ క్లినికల్ అధ్యయనంలో తమ ఓరల్ కలరా వ్యాక్సిన్ హిల్కోల్ విజయం సాధించందని, పెద్దలు, పిల్లలలో కలరాకు సంబంధించిన ఒగావా, ఇనాబా సెరోటైప్స్ రెండింటికీ వ్యతిరేకంగా పనిచేసిందని భారత్ బయోటెక్ తెలిపింది.
కలరా అనేది విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా కలిగించే అతిసార వ్యాధి. కలుషితమైన ఆహారం లేదా నీటిని తీసుకోవడం వల్ల ఇది సంక్రమిస్తుంది. ఏటా 28.6 లక్షల కేసులు నమోదవుతుండగా 95,000 మరణాలు సంభవిస్తున్నాయని అధ్యయనాలు అంచనా వేశాయి. ఓరల్ కలరా వ్యాక్సిన్లకు ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 10 కోట్ల డోసుల డిమాండ్ ఉందని, కేవలం ఒక తయారీదారు మాత్రమే వాటిని సరఫరా చేస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా కొరత ఏర్పడిందన్నారు. హైదరాబాద్, భువనేశ్వర్‌లోని భారత్ బయోటెక్ కేంద్రాలు 20 కోట్ల డోసుల హిల్కోల్‌ను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని కంపెనీ తెలిపింది.
ఈ అధ్యయనంలో పాల్గొన్నవారిని 18 ఏళ్లు పైబడిన పెద్దలు, 5 నుండి 18 సంవత్సరాలలోపు పిల్లలు, సంవత్సరం నుండి ఐదేళ్లలోపు చిన్నపిల్లలు మూడు గ్రూపులుగా విభజించి వ్యాక్సిన్ ప్రయోగించారు. అధ్యయన ఫలితాలు సైన్స్ డైరక్ట్ అనే వ్యాక్సిన్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. హిల్‌కాల్ వ్యాక్సిన్ ఒగావా, ఇనాబా సెరోటైప్‌లకు వ్యతిరేకంగా విబ్రియోసిడల్ యాంటీబాడీలను 4 రెట్లు అధికంగా తయారు చేసింది.
ఈ అధ్యయన ఫలితాలు కఠినమైన పరిశోధన, సమగ్ర క్లినికల్ ట్రయల్స్, నమ్మదగిన క్లినికల్ డేటాతో వ్యాక్సిన్లను తీసుకొస్తున్న తమ నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాయని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కృష్ణ ఎల్లా పేర్కొన్నారు. సమర్థవంతమైన, అందుబాటు ధరల్లో వ్యాక్సిన్‌లను అందించడంలో తమ నిబద్ధత నిరంతరం కొనసాగుతుందన్నారు.