
నా వయసు 42 ఏళ్లు. రిటైర్మెంట్ తర్వాతి అవసరాల కోసం ఇప్పటి నుంచి ప్రతి నెలా రూ.50,000 చొప్పున ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఏ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి? – వినోద్‌రావు అథవాలే
రిటైర్మెంట్ కోసం ఎంత మొత్తం అవసరమవుతుందన్నది ముందుగా నిర్ణయించుకోవాలి. అంత మొత్తాన్ని ఎలా సమకూర్చుకోవాలన్న స్పష్టత కలిగి ఉండాలి. విశ్రాంత జీవన అవసరాలకు కావాల్సినంత సమకూర్చుకునే ప్రణాళికలను రూపొందించుకోవాలి. రెండు నుంచి మూడు వరకు మంచి ఫ్లెక్సీక్యాప్ పథకాలను ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.
సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న రూ.50వేలలో 60 శాతాన్ని అంటూ రూ.30వేలను రెండు మూడు పథకాల్లో పెట్టుబడి పెట్టుకోవాలి. రిటైర్మెంట్‌కు 16 ఏళ్లు సమయం మిగిలి ఉంది. కనుక మీ పెట్టుబడి అప్పటికి గణనీయంగా వృద్ధి చెందుతుంది.
ఈక్విటీ పథకాల్లో రిస్క్‌ల పట్ల పెద్దగా అవగాహన లేకపోతే, అప్పుడు అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇవి అచ్చమైన ఈక్విటీ పథకాలతో పోలిస్తే కొంచెం తక్కువ అస్థిరతలతో ఉంటాయి. అలాగే రూ.20వేలను ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ పథకాలకు కేటాయించుకోవాలి. దీనివల్ల రిటైర్మెంట్ అనంతరం.. ఈక్విటీ పెట్టుబడులను ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ పథకాల్లోకి మార్చాల్సిన అవసరం ఏర్పడదు. ఎందుకంటే సగం పెట్టుబడులు ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ (డెట్ ఫండ్స్) సాధనాల్లోనే ఉంటాయి. ఈక్విటీ, డెట్ మధ్య పెట్టుబడుల కేటాయింపు జాగ్రత్తగా ఉండాలి. ద్రవ్యోల్బణ ప్రభావాన్ని అధిగమించేలా, వడ్డీ రేట్లు తగ్గినప్పుడు ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ సాధనాలపై పడే ప్రభావాన్ని అధిగమించేలా ఈ సమతూకం ఉండాలి.
నా పెట్టుబడుల్లో అధిక భాగంగా ఈక్విటీల్లోనే ఉన్నాయి. మార్కెట్లలో అస్థిరతలు, ఆటుపోట్లను అధిగమించడం ఎలా? – బ్రదర్ జోసెఫ్
ఈక్విటీల్లో అస్థిరతలు సహజం. ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకు అనుగుణంగా ఇవి చలిస్తుంటాయి. వీటిని ఎదుర్కోవడం ఎలా అన్నది ఇన్వెస్టర్లకు తెలిసి ఉండాలి. ప్రతీ ఇన్వెస్టర్ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లను తీసుకుని తమకు, తమ కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించుకోవడం అన్నింటికంటే ముందు చేయాల్సి నపని. అత్యవసర సందర్భాల్లో, తాత్కాలిక అవసరాలకు ఈక్విటీ పెట్టుబడులను కదలించకుండా.. విడిగా అత్యవసర నిధిని (ఈఎఫ్) ఏర్పాటు చేసుకోవాలి. ఈక్విటీల్లో పెట్టుబడులను కనీసం ఐదు నుంచి ఏడేళ్ల పాటు కదపకుండా ఉండాలా ఏర్పాట్లు చేసుకోవాలి.
ఈక్విటీ అస్థిరతలను అధిగమించేందుకు ఈ చర్యలు అవసరం. అలాగే, సిప్ వంటి సాధనాల ద్వారా ఇన్వెస్ట్ చేయడం వల్ల మార్కెట్ దిద్దుబాట్ల నుంచి అదనపు రాబడుల ప్రయోజనాన్ని పొందొచ్చు. సిప్ రూపంలో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేసే వారికి మార్కెట్లలో కరెక్షన్‌లు నిజంగా మంచి అవకాశాలను తెస్తాయి. ఎందుకంటే ఆ సమయాల్లో ఎక్కువ ఫండ్ యూనిట్లను తక్కువ ధరకే సమకూర్చుకోవచ్చు. మార్కెట్లు దిద్దుబాటుకు గురైతే చౌకగా కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. అనవసరపు ఆందోళనతో సిప్ నిలిపివేయడం, ఈక్విటీ పెట్టుబడులను విక్రయించడం చేయరాదు. పైగా ఆ సమయంలో తప్పకుండా సిప్‌ను కొనసాగించాలి. వీలైతే సిప్ మొత్తాన్ని పెంచుకుని అదనంగా ఇన్వెస్ట్ చేయాలి. దీనివల్ల దీర్ఘకాలంలో రాబడులను గణనీయంగా పెంచుకోవచ్చు.
ధీరేంద్ర కుమార్: సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్