రుణాలు @ రూ.63,574 కోట్లు | Banks sanction Rs 63574 cr under credit outreach initiative | Sakshi
Sakshi News home page

రుణాలు @ రూ.63,574 కోట్లు

Nov 3 2021 4:07 AM | Updated on Nov 3 2021 4:07 AM

Banks sanction Rs 63574 cr under credit outreach initiative - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ బ్యాంకింగ్‌ ‘క్రెడిట్‌ అవుట్‌రీచ్‌’ కార్యక్రమం కింద కేవలం పక్షం రోజుల్లో దాదాపు 13.84 లక్షల మంది రుణ గ్రహీతలకు రూ.63,574 కోట్ల రుణాలను అందజేసిందని ఆర్థికమంత్రి నిర్మాలా సీతారామన్‌ ఒక ట్వీట్‌లో తెలిపారు. దేశ వ్యాప్తంగా అక్టోబర్‌ 16వ తేదీన ఈ కార్యక్రమం ప్రారంభమైన సంగతి తెలిసిందే.  ఈ కార్యక్రమం కింద, బ్యాంకులు నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం అర్హులైన రుణగ్రహీతలకు రుణాలను మంజూరు చేయడానికి దేశంలోని వివిధ ప్రాంతాలలో దాదాపు 10,580  శిబిరాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనితోపాటు పలు  బ్యాంకులు రాయితీ వడ్డీ రేట్లు,  ప్రాసెసింగ్‌ ఫీజు  మాఫీ వంటి పండుగ ఆఫర్‌లను ప్రకటించాయి.

‘ఆగస్టులో  ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్‌లతో నిర్వహించిన  సమీక్ష సందర్భంగా, ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ ఆర్థిక వృద్ధి పునరుద్ధరణకు మద్దతును అందించే క్రమంలో అక్టోబర్‌లో క్రెడిట్‌ అవుట్‌రీచ్‌ ప్రోగ్రామ్‌ను నిర్వహించాలని బ్యాంకులకు సూచించారు. దీనికి అనుగుణంగా, బ్యాంకులు జిల్లాల వారీగా,  రంగాల వారీగా రుణ ఔట్‌రీచ్‌ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తున్నాయి‘ అని ఆర్థిక మంత్రి కార్యాలయం ట్వీట్‌ చేసింది. బ్యాంకులు–నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీ), ఫిన్‌టెక్‌ సెక్టార్‌ల మధ్య సహ–రుణ  ఏర్పాట్ల ద్వారా కేంద్రం క్రెడిట్‌ అవుట్‌రీచ్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.  

మంచి స్పందన
వివిధ కేంద్ర ప్రభుత్వ రుణ గ్యారెంటీ పథకాల కింద మంజూరు చేసిన,  పంపిణీ చేసిన నిధుల పరిమాణంకంటే క్రెడిట్‌ అవుట్‌రీచ్‌ ప్రోగ్రామ్‌ కింద జారీ అయిన రుణాలు అధికంగా ఉండడం గమనార్హం. ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, దాదాపు 3.2 లక్షల మంది లబ్ధిదారులకు రూ.21,687.23 కోట్ల వ్యాపార రుణాలు మంజూరు చేయగా, 59,090 మంది రుణగ్రహీతలకు రూ.4,560.39 కోట్ల విలువైన వాహన రుణాలు మంజూరయ్యాయి. 41,226 మంది రుణగ్రహీతలకు రూ.8,994.25 కోట్ల విలువైన గృహ రుణాలు మంజూరయ్యాయి. ఏడు లక్షలకు మందికిపైగా రైతులకు రూ.16,734.62 కోట్ల వ్యవసాయ రుణాలు మంజూరయ్యాయి.

గతంలో ఇలా...
2019 అక్టోబర్‌ –  2021 మార్చి మధ్య ఇలాంటి అవుట్‌రీచ్‌ కార్యక్రమాలను బ్యాంకులు నిర్వహించాయి. తద్వారా ఆర్‌ఏఎం సెక్టార్‌ (రిటైల్, వ్యవసాయం, లఘు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు) అన్ని రకాల రుణ అవసరాలను నెరవేర్చాయి. అప్పట్లో ఈ కార్యక్రమం కింద రూ.4.94 లక్షల కోట్లు పంపిణీ చేసినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ఈ పండుగ సీజన్‌లో కూడా చిన్న రుణగ్రహీతలకు సరసమైన వడ్డీ రేట్లలో భారీ ఎత్తున ఈ కార్యక్రమం కింద రుణాలను అందజేయాలని కేంద్రం నిర్దేశిస్తోంది. బ్యాంకింగ్‌కు ఇందుకు తగిన సూచనలు అందాయి.

Advertisement
 
Advertisement
Advertisement