
ఉత్పత్తుల అమ్మకాలకు జీఎస్‌టీ తగ్గింపు జోష్
రికార్డు స్థాయిలో విక్రయాలు
ఆశావహంగా వాహన, ఎల్రక్టానిక్స్ సంస్థలు
న్యూఢిల్లీ: పండగ సీజన్‌లో జీఎస్‌టీ రేట్ల తగ్గింపు అమల్లోకి రావడంతో పలు ఉత్పత్తుల అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ పండగ సీజన్‌లో అమ్మకాలు భారీగా ఉంటాయని వాహనాలు, ఎల్రక్టానిక్ ఉపకరణాలు, కన్జూమర్ డ్యూరబుల్స్ తయారీ సంస్థలు, రిటైలర్లు ఆశిస్తున్నారు. ఇదే తీరు పండుగ సీజన్ మొత్తం కొనసాగుతుందని భావిస్తున్నాయి. ఇప్పటికే దసరా నవరాత్రుల సందర్భంగా తొలిరోజే కొన్ని వాహనాలు, ఏసీల తయారీ సంస్థలు రికార్డు స్థాయి విక్రయాలు నమోదు చేశాయి. మొదటి రోజున 10,000 ప్యాసింజర్ వాహనాలను విక్రయించినట్లు టాటా మోటార్స్ వెల్లడించింది.
దీనితో పాటు దేశవ్యాప్తంగా 25,000 పైచిలుకు కస్టమర్ల ఎంక్వైరీలు వచ్చినట్లు తెలిపింది. గత అయిదేళ్లలో తొలిసారిగా ఒకే రోజున అత్యధికంగా మారుతీ సుజుకీ 30,000 యూనిట్లు, హ్యుందాయ్ 11,000 వాహనాలను విక్రయించినట్లు వెల్లడించాయి. కన్జూమర్ సెంటిమెంటు, సోమవారం నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్‌టీ తగ్గింపుతో పండగ సీజన్ అమ్మకాల ధోరణిపై స్పందిస్తూ ‘వాహనాల కొనుగోలు కోసం కస్టమర్లు పెద్ద ఎత్తున షోరూంలకు వస్తున్నారు’ అని ఆటోమొబైల్ డీలర్ల అసోసియేషన్ల సమాఖ్య ఫాడా ప్రెసిడెంట్ సీఎస్ విఘ్నేశ్వర్ తెలిపారు.
‘ఈ పండగ సీజన్ చాలా సానుకూలంగా ప్రారంభమైంది. జీఎస్‌టీ తగ్గింపు, ఆకర్షణీయమైన ప్రత్యేక ఆఫర్లతో కొనుగోళ్లపై కస్టమర్లలో అసాధారణంగా ఆసక్తి పెరిగింది‘ అని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ ఎండీ, సియామ్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర చెప్పారు. నవరాత్రుల తొలి రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా డీలర్‌షిప్‌లను సందర్శించే కస్టమర్ల సంఖ్య, ఎంక్వయిరీలు, వాహనాల డెలివరీలు రికార్డు స్థాయిలో పెరిగాయని ఆయన పేర్కొన్నారు.
ఇతర కంపెనీలు ఏమన్నాయంటే..
→ ‘సాధారణంగా సోమవారం నాడు కస్టమర్ల సంఖ్య తక్కువగా ఉంటుంది. కానీ ఈసారి మాత్రం భారీగా పెరిగింది. రోజువారీగా కన్నా డెలివరీల పరిమాణం రెట్టింపు పెరిగింది‘ అని విజయ్ సేల్స్ డైరెక్టర్ నీలేష్ గుప్తా చెప్పారు.
→ ఏసీలపై జీఎస్‌టీ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గడం, ఆకర్షణీయమైన ఆఫర్ల దన్నుతో పండగ సీజన్ ప్రారంభంలోనే తమ ఏసీల విక్రయాలు రికార్డు స్థాయిలో నమోదైనట్లు పానసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ఇండియా బిజినెస్ హెడ్ (ఏసీ గ్రూప్) అభిషేక్ వర్మ తెలిపారు.
→ అమ్మకాలపై జీఎస్‌టీ తగ్గింపు ప్రభావం ఎంత ఉందనేది ఇప్పుడే అంచనా వేయలేకపోయినా, మొత్తం మీద విక్రయాలు మాత్రం చాలా సానుకూలంగా ఉన్నాయని గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్ బిజినెస్ హెడ్ (అప్లయెన్సెస్ బిజినెస్) కమల్ నంది తెలిపారు. కొన్ని స్టోర్స్ సుదీర్ఘ సమయం పాటు తెరిచి ఉంటున్నాయని చెప్పారు.
→ కొనుగోలుదారుల సెంటిమెంటు సానుకూలంగా, అమ్మకాల ధోరణులు ప్రోత్సాహకరంగా కనిపిస్తున్నాయని ఎల్‌జీ ఎల్రక్టానిక్స్ ఇండియా ప్రతినిధి తెలిపారు. ఇక ముందు కూడా ఇదే తీరు కొనసాగవచ్చని వివరించారు.
→ జీఎస్‌టీ రేట్ల సవరణతో అమ్మకాలకు ఊతం లభిస్తుందని క్రోమా రిటైల్ చెయిన్ నిర్వహించే టాటా గ్రూప్ సంస్థ ఇన్ఫినిటీ రిటైల్ సీఈవో శిబాశీష్ రాయ్ తెలిపారు.