ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి పాత వాహనాలు
గ్రేటర్‌లో ఇలాంటివి 20 లక్షలకుపైగానే
లైఫ్‌ట్యాక్స్ తప్పించుకొనేందుకే వెనుకంజ
సాక్షి, హైదరాబాద్: వాహన బదిలీ మరిచారా... తస్మాత్ జాగ్రత్త. మీ చేయి దాటిన బండి మరే చేతికి వెళ్లినా ప్రమాదం పొంచి ఉన్నట్లే. ఒకసారి వాహనాన్ని విక్రయించిన తర్వాత యాజమాన్య బదిలీ ప్రక్రియను వెంటనే పూర్తి చేసుకోవాలి. జాప్యం జరిగితే మూల్యం తప్పకపోవచ్చు. గ్రేటర్‌లో లక్షలాది వాహనాలు ఇలా బదిలీ కాకుండా ఉన్నాయి. రకరకాల కారణాలను సాకుగా చూపుతూ చాలామంది యజమానులు వాటి బదిలీ ప్రక్రియను విస్మరిస్తున్నారు. సెకండ్‌సేల్స్ షోరూమ్‌లలో కొనుగోలు చేసే వాహనాల విషయంలో ఈ నిర్లక్ష్యం మరింత తీవ్రంగా ఉంది. వాహనం ఏదైనా సరే ఒకరి నుంచి మరొకరికి బదిలీ అయినప్పుడు రవాణాశాఖ నుంచి అధికారిక ధ్రువీకరణ తప్పనిసరి. కానీ అలా చేయకుండానే లక్షలాది వాహనాలు చేతులు మారుతున్నాయి. సదరు వాహనాలు నేరపూరిత కార్యకలాపాల్లో భాగంగా మారితే అమాయకులు భారీగా నష్టపోతారని రవాణా అధికారులు హెచ్చరిస్తున్నారు.
హరియాణా బండికి ఐస్ అయిపోవద్దు
ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హరియాణా రాష్ట్రాలకు చెందిన కార్లు మన నగరానికి భారీగా తరలివస్తున్నాయి. వాహన కాలుష్యం దృష్ట్యా ఆయా రాష్ట్రాల్లో నిషేధించిన డీజిల్ వాహనాలను నగరవాసులు కొనుగోలు చేస్తున్నారు. తక్కువ ధరల్లో లభించడంతో ఉత్తరాది వాహనాల పట్ల ఆసక్తిని చూపుతున్నారు. కానీ ఇలా నగరానికి తరలిస్తున్న వాహనాలను హైదరాబాద్ ఆర్టీఏ కార్యాలయాల్లో నమోదు చేయడం లేదు. మధ్యవర్తుల సహాయంతో కొనుగోలు చేసే ఈ వాహనాలు వాటి పాత యజమానుల చిరునామాపైనే నగరంలో తిరుగుతున్నాయి. మరోవైపు రెండు, మూడేళ్లలోనే చేతులు మారుతున్నా.. చట్టబద్ధంగా నమోదు కావడం లేదు. ఇలాంటి వాహనాల్లో చాలా వరకు హరియాణా, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో అపహరించి తెచ్చినవే ఎక్కువగా ఉంటున్నాయని ఆర్టీఏ అధికారులు చెబుతున్నారు. సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేసిన వెంటనే తప్పనిసరిగా యాజమాన్య బదిలీ చేసుకోవాలని సూచిస్తున్నారు.
వాహనాలే ఆయుధాలుగా మారి..
నగరవాసులకు దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా ఆలయంలో జరిగిన బాంబు పేలుడు ఘటన గుర్తుండే ఉంటుంది. ఉగ్రవాదులు ఒక స్కూటర్‌లో పేలుడు పదార్థాలను ఉంచి సాయిబాబా ఆలయంలో వదిలి వెళ్లారు. ఈ ఘటనలో చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. కొందరు గాయాల పాలయ్యారు. స్కూటర్‌ను కీలంగా చేసుకొని పోలీసులు విచారణ చేపట్టారు. ఆ వాహనం అప్పటికే కొంతమంది వ్యక్తుల చేతులు మారింది. ఎలాంటి ప్రమేయం లేకపోయినప్పటికీ అప్పట్లో ఒకరిద్దరు వ్యక్తులు తీవ్రంగా నష్టపోయారు. వాహనం విక్రయించిన వెంటనే బదిలీ చేయకపోవడంతో ఎలాంటి నేరం చేయకపోయినప్పటికీ మూల్యం చెల్లించాల్సి వచి్చంది. అందుకే వాహనాలను విక్రయించిన వెంటనే వాటి యాజమాన్య బదిలీ ప్రక్రియను కూడా పూర్తి చేయాలని రవాణా అధికారులు సూచిస్తున్నారు. తరచుగా జరిగే ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు, రోడ్డు ప్రమాదాలే కాకుండా చివరకు ఉగ్రమూకల చేతుల్లో వాహనాలే బాంబులుగా మారే అవకాశం ఉన్నట్లు పేర్కొంటున్నారు.
బదిలీ చేసుకోవడం ఇలా..
సెకండ్ హ్యాండ్ వాహనాలను ఒకరి నుంచి మరొకరికి విక్రయించిన వెంటనే యాజమాన్య బదిలీ కూడా పూర్తి చేయాలి. ఇందుకోసం ఆన్‌లైన్‌లో స్లాట్ నమోదు చేసి ఫీజు చెల్లించాలి. అనంతరం నిర్ణీత తేదీ ప్రకారం ఫామ్ నంబర్లు 29, 30, 35లతో సంబంధిత ప్రాంతీయ రవాణా అధికారిని సంప్రదించాలి. ఫామ్ 29, 30 వాహన విక్రయాన్ని నిర్ధారించేవి. ఫామ్ 35 బ్యాంకుల నుంచి తీసుకొనే రుణ విముక్తి పత్రం. వాహన బదిలీలో ఈ మూడూ కీలకం. ద్విచక్ర వాహనాలు, కార్లు, రవాణా వాహనాల కేటగిరీల మేరకు రూ.600 నుంచి రూ.2500 వరకు రవాణా శాఖకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.


