
యాపిల్ ఏటా కొత్తగా ఉత్పత్తులను లాంచ్ చేసే వార్షిక అప్‌గ్రేడ్‌ల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ 2025 సెప్టెంబర్‌లో ఐఫోన్ 17ను విడుదల చేయడానికి సన్నద్ధమవుతున్నట్లు టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే దీనిపై కంపెనీ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఇతర పోటీ కంపెనీలు ఏఐలో వినూత్న ఆవిష్కరణలు చేస్తూ తమ ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో యాపిల్ ఆవిష్కరించనున్న ఉత్పత్తుల్లో వినియోగదారులను మెప్పించేలా ఏఐ సామర్థ్యాలను నిరూపించుకోవాల్సి ఉంటుంది.
యాపిల్ తన ఫ్లాగ్‌షిప్ సిరీస్‌లో నాలుగో మోడల్ ఐఫోన్ 17 ఎయిర్‌ను ప్రవేశపెడుతున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. దీనితో పాటు ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌ను కూడా ఆవిష్కరించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ అన్ని మోడళ్లలో 120 హెర్ట్జ్ ప్రోమోషన్ డిస్‌ప్లేలు ఉంటాయని, బేస్ మోడల్ 6.3 అంగుళాల నుంచి ప్రో మ్యాక్స్‌కు 6.9 అంగుళాల వరకు స్క్రీన్ సైజులు ఉంటాయని అంచనాలు వెలువడుతున్నాయి. ఎయిర్ వేరియంట్ 6.6 అంగుళాల డిస్‌ప్లేతో రావచ్చని భావిస్తున్నారు.
ఇదీ చదవండి: ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపైనే ఆశలు
ఏఐ పీచర్లు ఇవేనా..?
యాపిల్ ఐఫోన్ 17 లైనప్ ద్వారా వినూత్న ఏఐ ఫీచర్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. కొత్త ఐఫోన్‌లో వాడే ఏ19 బయోనిక్ చిప్‌లో అప్‌గ్రేడ్ చేసిన న్యూరల్ ఇంజిన్ ద్వారా ఏఐ ఫీచర్లలో మార్పులొస్తాయని చెబుతున్నారు.
యాపిల్ సిరి మరింత సందర్భోచింతంగా అవగాహన కలిగి ఉంటుంది.
నెక్ట్స్ జనరేషన్ ఫోటోగ్రఫీ టూల్స్‌లో భాగంగా ఏఐ అసిస్టెడ్ రియల్ టైమ్ సీన్ డిటెక్షన్, ఆటో ఆబ్జెక్ట్ రిమూవల్, ఇమేజ్ జనరేషన్ వంటివి ఉండవచ్చు.
మరింత కచ్చితమైన వాయిస్ ట్రాన్స్‌లేషన్ అందుబాటులోకి రావొచ్చు.
కృత్రిమ మేధ బ్యాటరీ నిర్వహణతో ఛార్జింగ్ సామర్థ్యాన్ని ఆప్టిమైజ్ చేసే వెసులుబాటు ఉంటుంది. వినియోగదారులు తమ ఐఫోన్ నుంచి నేరుగా ఎయిర్‌పాడ్స్ యాక్ససరీలను ఛార్జ్ చేయడానికి అనుమతిస్తుంది.