
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కాలేయ వ్యాధుల చికిత్సకు సంబంధించి కొత్త ఆవిష్కరణలు చేసే దిశగా అపోలో హాస్పిటల్స్, సీమెన్స్ హెల్తినీర్స్ చేతులు కలిపాయి. ఈ ఒప్పందంలో భాగంగా వ్యాధులను ముందుగా గుర్తించడం, పర్యవేక్షణ, చికిత్స మొదలైన వాటికి కృత్రిమ మేథ (ఏఐ), అల్ట్రాసౌండ్ ఇమేజింగ్‌లాంటి సాంకేతికతలను ఉపయోగిస్తాయి. తద్వారా మరింత మెరుగైన ఫలితాలను సాధించడంపై దృష్టి పెడతాయి.
ఏఐని ఉపయోగించి, గాటు పెట్టకుండా కాలేయ వ్యాధికి చికిత్సను అందించే దిశగా సీమెన్స్ హెల్తినీర్స్‌తో భాగస్వామ్యం కీలక ముందడుగు కాగలదని అపోలో హాస్పిటల్స్ జాయింట్ ఎండీ సంగీత రెడ్డి తెలిపారు. వ్యాధులను సకాలంలో కచి్చతంగా గుర్తించేందుకు, మెరుగైన చికిత్సను అందించేందుకు, పేషంట్లకు మెరుగైన జీవితాన్ని అందించేందుకు అధునాతన టెక్నాలజీలు తోడ్పడతాయని సీమెన్స్ హెల్త్‌కేర్ ఎండీ హరిహరన్ సుబ్రమణియన్ చెప్పారు.