
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) కంపెనీల పనితీరును మార్చబోతోందని అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ తెలిపారు. దీని ఫలితంగా చాలామంది ఉద్యోగాలకు ముప్పు వాటిల్లుతుందని చెప్పారు. ఏఐ వాడకం పెరుగుతుండడంతో నిర్ణీత విభాగాల్లో తక్కువ మంది అవసరం అవుతారని చెప్పారు. సీఎన్‌బీసీకి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో జాస్సీ ఈమేరకు వివరాలు వెల్లడించారు. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా వృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో సంస్థల్లో పని చేస్తున్న కొంతమంది ఉద్యోగులతో పోలిస్తే ఏఐ సమర్థవంతంగా ఆయా పనులు నిర్వహిస్తుందని అంగీకరించారు.
ఈ వ్యాఖ్యలు ఉద్యోగుల్లో ఆందోళనకు కారణమవుతున్నప్పటికీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త ఉపాధి అవకాశాలకు తెరతీస్తుందని జాస్సీ చెప్పారు. ఏఐ వల్ల కొన్ని పనులు ఆటోమేషన్ అవుతున్నప్పటికీ కృత్రిమ మేధ అభివృద్ధి, రోబోటిక్స్, మానవ నైపుణ్యాలు, ఆవిష్కరణలు అవసరమయ్యే ఇతర రంగాల్లో మరిన్ని మానవ వనరులు కావాలన్నారు.
ఇదీ చదవండి: వస్తు సేవల పన్ను విజయాల పరంపర
ఇతర కంపెనీల తీరిది..
సేల్స్‌ఫోర్స్ సీఈఓ మార్క్ బెనియోఫ్ ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఏఐ తమ కంపెనీలో 30 నుంచి 50 శాతం పనులు చేస్తోందని వెల్లడించారు. షాపిఫై, మైక్రోసాఫ్ట్ వంటి ఇతర టెక్ దిగ్గజాలు ఏఐని తమ రోజువారీ పనిలో భాగం చేసుకునేలా ఉద్యోగులను ప్రోత్సహిస్తున్నాయి. అమెజాన్‌లో పెద్ద ఎత్తున కృత్రిమ మేధను వినియోగిస్తున్నందున రాబోయే సంవత్సరాల్లో తమ ఉద్యోగులు తగ్గిపోయే అవకాశం ఉందని కంపెనీ ఇప్పటికే పరోక్షంగా హెచ్చరించింది.