
భారత్‌లో వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ను జులై 1, 2017న ప్రవేశపెట్టడం ద్వారా ఆర్థిక ఏకీకరణ దిశగా సాహసోపేతమైన అడుగు పడిందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఎనిమిదేళ్ల తరువాత 2025లో జీఎస్టీ విధానం దేశ చరిత్రలో అత్యంత ముఖ్యమైన పన్ను సంస్కరణల్లో ఒకటిగా నిలుస్తోందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థను క్రమబద్ధీకరించడం, పారదర్శకతను పెంచడం, వృద్ధిని పెంపొందించేందుకు విలువ ఆధారిత పన్నులు(వ్యాట్) స్థానంలో జీఎస్టీని ప్రవేశపెడుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అప్పటి నుంచి నేటి వరకు జీఎస్టీ సాధించిన కొన్ని విజయాల గురించి తెలుసుకుందాం.
ఒకే దేశం, ఒకే పన్ను
జీఎస్టీ అమలు ద్వారా 17 వేర్వేరు పన్నులు, 13 సెస్‌లను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చారు. దాంతో గతంలో రాష్ట్రాల్లో ఉన్న పరోక్ష పన్నుల భారం తొలగిపోయింది. ఈ సమన్వయం ఒక ఉమ్మడి జాతీయ విధానాన్ని సృష్టించింది. లాజిస్టిక్స్ ఖర్చులను గణనీయంగా తగ్గించింది. రాష్ట్రాల మధ్య వాణిజ్యాన్ని సులభతరం చేసింది.
రికార్డు స్థాయిలో ఆదాయ వృద్ధి
2024-25 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు 9.4 శాతం పెరిగి చరిత్రాత్మకంగా రూ.22.08 లక్షల కోట్లకు చేరుకున్నాయి. బలమైన యంత్రాంగాలు, భారతదేశం క్రమంగా విస్తరిస్తున్న ఆర్థిక కార్యకలాపాల కారణంగా నెలవారీ వసూళ్లు ప్రస్తుతం సగటున రూ.1.84 లక్షల కోట్లుగా ఉంది.
ట్యాక్స్ నమోదులో పెంపు
ఏప్రిల్ 2025 నాటికి జీఎస్టీ 1.51 కోట్లకు పైగా యాక్టివ్ రిజిస్ట్రేషన్లను కలిగి ఉంది. చిన్న వ్యాపారాలు, స్టార్టప్‌లు, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్.. వంటివాటిని పన్ను పరిధిలోకి తీసుకురావడం ద్వారా దేశాన్ని మరింత పారదర్శక ఆర్థిక వ్యవస్థగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు.
డిజిటల్ ఫైలింగ్
జీఎస్టీ విధానం పన్ను సమ్మతిని మరింత సులభతరం చేసింది. కేంద్రీకృత ఆన్‌లైన్ పోర్టల్, మొబైల్ అప్లికేషన్లు, క్యూఆర్ఎంపీ (క్వార్టర్లీ రిటర్న్స్ విత్ మంత్లీ పేమెంట్) వంటి పథకాలతో రిటర్నులను దాఖలు చేసేందుకు వెసులుబాటు కల్పించింది. ముఖ్యంగా ఈ విధానాల ద్వారా చిన్న, మధ్యతరహా సంస్థలకు ఎంతో మేలు జరుగుతోంది.
సహకార విధానం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పన్నుల వ్యవస్థను నడిపించేలా జీఎస్టీ కౌన్సిల్ ఇప్పటి వరకు 55కి పైగా సమావేశాలు నిర్వహించింది. ఉమ్మడి నిర్ణయాలు తీసుకోవడానికి ఈ వేదిక సహకారాన్ని పెంపొందించడమే కాకుండా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక అవసరాలను తీర్చేలా వీలు కల్పించింది.
ఇదీ చదవండి: అత్యంత కుబేరులున్న నగరాల జాబితా విడుదల
సవాళ్లు లేవా..
జీఎస్టీ పన్ను వ్యవస్థలో పెనుమార్పులు తీసుకువచ్చినప్పటికీ రేట్ల సరళీకరణ, కాంప్లయన్స్ లోపాలను పరిష్కరించడం, ఐటీ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం వంటి సవాళ్లు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ, ఈ వ్యవస్థ మరింత సమర్థవంతమైన, ఏకీకృత, పారదర్శక పన్ను విధానానికి పునాది వేస్తుంది.