
వస్తు సేవల పన్ను శ్లాబులను ఇటీవల సవరించిన ప్రభుత్వం వినియోగ వస్తువుల కంపెనీలకు కార్యాచరణ అడ్డంకులను తగ్గించే లక్ష్యంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంది. వస్తువుల తయారీదారులు, ప్యాకర్లు, దిగుమతిదారులకు కొత్త జీఎస్టీ రేట్లను ప్రతిబింబించేలా అమ్ముడుపోని ప్రీ-ప్యాకేజ్డ్ స్టాక్‌పై గరిష్ట రిటైల్ ధర (MRP)ను సవరించడానికి అనుమతించింది. దీని అమలు డిసెంబర్ 31, 2025లోపు పూర్తికావాలని చెప్పింది. కొత్తగా తయారయ్యే స్టాక్‌కు మారిన రేట్లను అప్‌డేట్ చేస్తారని గమనించాలి.
కేబినెట్ కార్యదర్శి టి.వి.సోమనాథన్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశం తర్వాత ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాల ప్రకారం మార్పులను అమలు చేయడంలో పరిశ్రమ వర్గాలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఈమేరకు వెసులుబాటు తీసుకొచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇది వృధాను నివారించడానికి, సప్లై చెయిన్ కార్యకలాపాలు సజావుగా సాగేలా చూడటానికి ఆచరణాత్మక విధానమని చెప్పింది.
నోటిఫికేషన్‌లోని నిబంధనలు
కంపెనీలు జీఎస్టీ సవరణ తేదీకి ముందు తయారు చేసిన అమ్ముడుపోని స్టాక్‌పై ఉన్న ఎంఆర్‌పీని సవరించవచ్చు.
శ్లాబుల వారీగా వస్తువుల రేట్లు పెరిగినా, తగ్గినా సవరించేలా రెండింటినీ లెక్కించవచ్చు.
అప్‌డేట్ అయిన ధరలను స్టిక్కర్లు, స్టాంపింగ్ లేదా ఆన్‌లైన్ ప్రింటింగ్ ఉపయోగించి వినియోగదారులకు తెలియజేయవచ్చు.
ఒరిజినల్ ఎంఆర్‌పీ స్పష్టంగా కనిపించాలి.
కంపెనీలు సవరించిన ఎంఆర్‌పీల గురించి వినియోగదారులు, డీలర్లు, పంపిణీదారులకు ప్రకటనలు, పబ్లిక్ నోటీసుల ద్వారా తెలియజేయాలి.
ఇప్పటికే ఉన్న ప్యాకేజింగ్, ర్యాపర్లను డిసెంబర్ 31 వరకు లేదా స్టాక్స్ అయిపోయే వరకు ఉపయోగించవచ్చు.
ఇదీ చదవండి: నెలకు రూ.18 వేలు జీతం.. ప్రపంచంలోనే రిచ్..