
ప్రపంచ దేశాల ఒత్తిడి, యూఎస్, ఈయూల సెకండరీ ఆంక్షల(రష్యాతో వ్యాపారం సాగిస్తున్న దేశాలు, కంపెనీలపై పరోక్షంగా విధించి ఆంక్షలు) ప్రభావం కారణంగా రష్యా నుంచి భారత్‌కు ముడి చమురు దిగుమతులు తగ్గినట్లు తెలుస్తుంది. దాంతో దేశంలోని 13 ప్రధాన ఓడరేవుల్లో అత్యంత ముఖ్యమైన దీనదయాళ్ పోర్ట్(Deendayal Port)లో గణనీయంగా సరఫరా దెబ్బతింది. రష్యన్ చమురు రవాణాలో కీలక పాత్ర పోషించే ఈ నౌకాశ్రయం తాజా గణాంకాల ప్రకారం క్రూడ్ వాల్యూమ్ క్షీణతను నమోదు చేసింది.
2025 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో దీనదయాళ్ పోర్ట్ నిర్వహించిన ముడి చమురు, ఎల్‌పీజీ/ఎల్‌ఎన్‌జీ మొత్తం వాల్యూమ్ 30.07 లక్షల టన్నులకు తగ్గింది. ఇది గత ఏడాది ఇదే కాలంలో నమోదైన 32.5 లక్షల టన్నుల వాల్యూమ్‌తో పోలిస్తే దాదాపు 6% క్షీణతను సూచిస్తుంది. భారతదేశంలోని ప్రధాన ఓడరేవుల్లో దీనదయాళ్ పోర్ట్ రష్యన్ చమురును అధికంగా నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ తగ్గుదల ఆందోళన కలిగిస్తోంది.
తగ్గుదలకు కారణాలు
భారతదేశంపై రష్యా చమురు దిగుమతులకు సంబంధించి ప్రత్యక్ష ఆంక్షలు లేనప్పటికీ అమెరికా (USA), యూరోపియన్ యూనియన్ (EU) విధించిన ద్వితీయ పరిమితుల (Secondary sanctions) ప్రభావం ప్రపంచవ్యాప్తంగా రష్యన్ చమురు సరఫరాపై పడింది. రవాణా, బీమా, ఆర్థిక లావాదేవీలు కఠినతరం కావడంతో దిగుమతిదారులు రష్యన్ చమురును నిలిపేస్తున్నారు. ఇతర ప్రత్యామ్నాయ వనరుల వైపు మళ్లుతున్నారు.
భారత్‌పై ఒత్తిడి
భారతదేశం తన ఇంధన అవసరాల కోసం రష్యా ముడి చమురుపై భారీగా ఆధారపడటాన్ని తగ్గించాలని యూఎస్, ఈయూ వంటి దేశాల నుంచి అంతర్జాతీయ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. రష్యా-ఉక్రెయిన్ వివాదం నేపథ్యంలో అమెరికా, పశ్చిమ దేశాలతో వ్యూహాత్మక సంబంధాలను కొనసాగించాల్సిన అవసరం భారత్‌కు ఉంది. రష్యా చమురు దిగుమతులను కొనసాగించడం ఈ సంబంధాలకు ఇబ్బంది కలిగిస్తుంది. రష్యా చమురుతో సంబంధం ఉన్న సంస్థలు, బ్యాంకులపై భవిష్యత్తులో అమెరికా సెకండరీ ఆంక్షలు విధించే అవకాశం ఉంది. ఈ ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి భారత్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది.
రిఫైనరీలపై ప్రభావం
దీనదయాళ్ పోర్ట్ ద్వారా సాగే ముడి చమురు సరఫరా ప్రధానంగా నయారా ఎనర్జీ (Nayara Energy- రష్యాకు చెందిన రోస్‌నెఫ్ట్ మద్దతు కలిగిన సంస్థ), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) వంటి రిఫైనరీలపై పడుతుంది. నయారా ఎనర్జీకి రష్యాకు చెందిన రోస్‌నెఫ్ట్‌తో 10 సంవత్సరాల దీర్ఘకాలిక ఒప్పందం ఉంది. అయితే ఈ ఒత్తిళ్ల మధ్య కూడా నయారా చమురు సరఫరా ప్రస్తుతానికి స్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇవి 6,700కు పైగా ఫ్యూయల్ స్టేషన్లకు ఇంధనాన్ని నింపుతూ దేశీయ సరఫరాను కొనసాగిస్తున్నాయి. తాత్కాలికంగా ఐఓసీకి చెందిన వదినార్ రిఫైనరీలో నిర్వహణ పనులు కూడా ముడి చమురు వినియోగం తగ్గడానికి మరో కారణంగా నిలిచింది.
ఇదీ చదవండి: దీపావళి కానుక.. బ్యాంకులు అదిరిపోయే ఆఫర్లు..