
భారత ప్రభుత్వ తాజా నిర్ణయం మేరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) టికెట్లపై వస్తువులు మరియు సేవల పన్ను (GST) రేటు 28 శాతం నుంచి 40 శాతానికి పెరిగింది. నిన్న (సెప్టెంబర్ 3) జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు.
ఈ పెంపుతో ఐపీఎల్ టికెట్లు లగ్జరీ సేవల శ్రేణిలోకి చేరాయి. క్యాసినోలు, రేస్ క్లబ్బులు, ఆన్‌లైన్ బెట్టింగ్ వంటి వినోద సేవల సరసన ఇప్పుడు ఐపీఎల్ కూడా చేరింది. ఈ నిర్ణయం 2025 సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానుంది. దీంతో తదుపరి ఐపీఎల్ సీజన్‌లో అభిమానులు స్టేడియంలో మ్యాచ్‌లు వీక్షించాలంటే అధిక ధర చెల్లించాల్సి ఉంటుంది.
ఐపీఎల్ వంటి ఈవెంట్లు అత్యధిక విలువ గల వినోద సేవలు కిందకు వస్తాయని, అందుకే అధిక పన్ను విధించాల్సి వచ్చిందని జీఎస్టీ కౌన్సిల్ పేర్కొంది. ఐపీఎల్ టికెట్ల ధరలను జీఎస్టీ అత్యధిక స్లాబ్ రేట్‌లోకి చేర్చడంపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. సోషల్‌మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
ఐపీఎల్ అనేది లగ్జరీ కాదని, అదో భావోద్వేగమని అంటున్నారు. అభిమానుల భావోద్వేగాలకు ఆర్దిక సంకెళ్లు వేయడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. టికెట్ల ధరలు పెరగడం వల్ల స్టేడియం హాజరు తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ చర్య ఫ్రాంచైజీల ఆదాయంపై పడవచ్చని అంటున్నారు.
ఇదిలా ఉంటే, ఐపీఎల్ టికెట్ల ధరలు పెరిగినా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల టికెట్ల ధరలు మాత్రం యధాతథంగా కొనసాగనున్నాయి. క్రికెట్‌తో పాటు మిగతా క్రీడా ఈవెంట్ల టికెట్ల ధరలు గతంలో మాదిరే 18 శాతం జీఎస్టీ స్లాబ్ రేట్ పరిధిలో ఉంటాయి.
