
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేట్ల హేతుబద్ధీకరణపై సెప్టెంబర్ 3, 4వ తేదీల్లో జరుగుతున్న కౌన్సిల్ సమావేశాల నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక చర్చనీయాంశమైంది. ఇటీవల ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు లేవనెత్తిన ఆందోళనలకు ఎస్‌బీఐ తాజా పరిశోధన నివేదిక కౌంటర్‌గా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. 53వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి ముందు మంగళవారం విడుదల చేసిన ఈ అధ్యయనం ప్రకారం 2026 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ, పన్నుల పంపిణీ ద్వారా మొత్తం రాష్ట్రాల ఆదాయం రూ.14 లక్షల కోట్లు దాటుతుందని ఎస్‌బీఐ అంచనా వేసింది.
ఎస్‌బీఐ గ్రూప్ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్, 16వ ఆర్థిక సంఘం సభ్యురాలు సౌమ్య కాంతి ఘోష్ నేతృత్వంలోని బృందం ఈ రీసెర్చ్ పేపర్లను విడుదల చేశారు. కొత్త పన్నుల క్రమబద్ధీకరణ వల్ల స్టేట్ జీఎస్టీ (ఎస్‌జీఎస్టీ) వసూళ్లలో రూ.10 లక్షల కోట్లు, పన్ను వికేంద్రీకరణ ద్వారా అదనంగా రూ.4.1 లక్షల కోట్లు వస్తాయని అంచనా వేశారు. జీఎస్టీ శ్లాబుల హేతుబద్ధీకరణ తర్వాత కూడా 2026 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రాలు పన్నుల పరంగా నికర లాభాలు ఆర్జిస్తున్నాయని నివేదిక తెలిపింది. తక్కువ జీఎస్టీ రేట్ల ఫలితంగా వినియోగం పెరిగి అదనపు ఆదాయం సమకూరుతుందని చెప్పింది.
ప్రతిపక్ష రాష్ట్రాల ఆందోళన
గతవారం కర్ణాటక, కేరళ, పశ్చిమబెంగాల్, తమిళనాడు, పంజాబ్ సహా ఎనిమిది ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు జీఎస్టీ వల్ల ఆదాయ నష్టాలను హైలైట్ చేస్తూ ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించాయి. జీఎస్టీ రేట్ల కోత, పరిహార సెస్ రద్దు కారణంగా రాష్ట్రాలకు వచ్చే ఆదాయంపై ప్రభుత్వం స్పష్టత కొరవడినట్లు కేంద్రానికి సమర్పించిన ఉమ్మడి వినతిపత్రంలో పేర్కొన్నారు. వివిధ ఆర్థిక పరిశోధనా సంస్థలు అందించే అంచనాల ప్రకారం.. ఏడాదికి రూ.85,000 కోట్ల నుంచి రూ.2 లక్షల కోట్లకు పైగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అందులో చెప్పారు. అయితే ఎస్‌బీఐ నివేదిక అందుకు భిన్నమైన స్వరాన్ని వినిపించింది. అన్ని రాష్ట్రాల్లో కలిపి మొత్తం జీఎస్టీ ఆదాయం అదనంగా రూ.4.14 లక్షల కోట్లు పెరుగుతుందని అంచనా వేసింది.
ఇదీ చదవండి: ఏఐతో ఉద్యోగాలు పోతాయా?