
కృత్రిమ మేధ(ఏఐ)తో గణనీయంగా ప్రయోజనాలు ఉంటాయని, పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కూడా పెరుగుతాయని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయుష్ గోయల్ చెప్పారు. లేటెస్ట్ ఏఐ, చాట్‌జీపీటీ వెర్షన్లను ఉపయోగించాలని తన కార్యాలయంలోని సిబ్బందికి కూడా తాను సూచించినట్లు ఆయన పేర్కొన్నారు. కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోవడంలో భారత్ ఎల్లప్పుడూ ముందుంటుందని పరిశ్రమ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి చెప్పారు.
ఏఐలాంటి టెక్నాలజీలతో ఉద్యోగాలు పోతాయనే వారి గురించి పెద్దగా పట్టించుకోనక్కర్లేదని ఆయన పేర్కొన్నారు. ఏఐని అనైతికంగా ఉపయోగిస్తే తలెత్తే సమస్యలను అరికట్టడానికి మానవ జోక్యం తప్పనిసరిగా అవసరమవుతుంది కాబట్టి, ఆ విధంగా ఉద్యోగాలు పెరుగుతాయని మంత్రి చెప్పారు. కాబట్టి దీన్నొక గొప్ప అవకాశంగా పరిగణించి, అందిపుచ్చుకోవాలని ఆయన వివరించారు.
ఏఐని అనైతికంగా ఉపయోగించడం వల్ల స్వల్పకాలికంగా కొన్ని సమస్యలు తలెత్తినప్పటికీ దీర్ఘకాలికంగా భారత్‌కి ఇది మేలే చేస్తుందన్నారు. డేటా, డాక్యుమెంట్ల భద్రత రీత్యా చాట్‌జీపీటీ, డీప్‌సీక్‌లాంటి టూల్స్‌ను ఆఫీస్ కంప్యూటర్లు, డివైజ్‌లలో డౌన్‌లోడ్ చేయొద్దని ఫిబ్రవరిలో కేంద్ర ఆర్థిక శాఖ తమ అధికారులకు ఆదేశించింది. అయితే, ఈ కొత్త టెక్నాలజీతో ఒనగూరే ప్రయోజనాలరీత్యా దీని వినియోగంపై ప్రభుత్వ విభాగాల్లో నిషేధమేమీ లేదంటూ మార్చిలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభకు తెలిపారు. కానీ భద్రత, గోప్యతను దృష్టిలో ఉంచుకుని ఉపయోగించాల్సి ఉంటుందని వివరించారు.
ఇదీ చదవండి: అమెరికాతో వాణిజ్య ఒప్పందాలపై చర్చలు