
సాధారణ స్థాయి దిశగా చైనాతో సంబంధాలు
కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయుష్ గోయల్ వెల్లడి
ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై (బీటీఏ) అమెరికాతో ఇంకా చర్చలు జరుగుతున్నట్లు కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయుష్ గోయల్ తెలిపారు. అలాగే చైనాతో కూడా సంబంధాలు తిరిగి సాధారణ స్థాయి దిశగా ముందుకు సాగుతున్నాయని చెప్పారు. సరిహద్దు సమస్యలు పరిష్కారమయ్యే కొద్దీ, సహజంగానే ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయని పరిశ్రమల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన వివరించారు. ఇప్పటికే ఆస్ట్రేలియా, యూఏఈ, మారిషస్, బ్రిటన్, ఈఎఫ్‌టీఏతో (యూరప్‌లోని నాలుగు దేశాల కూటమి) స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు మంత్రి చెప్పారు.
భారత్ మా వెంటే...: బెసెంట్
అగ్రరాజ్యం మన ఎగుమతులపై భారీగా సుంకాలు ప్రకటించిన నేపథ్యంలో అమెరికా–భారత్‌ల మధ్య మార్చి నుంచి ఇప్పటివరకు అయిదు విడతలు చర్చలు జరిగాయి. ఆరో విడత సంప్రదింపుల కోసం ఆగస్టు 25న అమెరికా బృందం భారత్ రావాల్సి ఉన్నప్పటికీ, ఆగస్టు 27 నుంచి సుంకాలను 50 శాతానికి పెంచేయడంతో, ఆ పర్యటన రద్దైంది. తదుపరి విడత చర్చలకు ఇంకా తేదీలు ఖరారు కాలేదు.
మరోవైపు, ఏది ఏమైనప్పటికీ భారత్ తమ వెంటే ఉంటుందని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ధీమా వ్యక్తం చేశారు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ పాటించే విలువలు రష్యా కన్నా అమెరికా, చైనాకి చాలా దగ్గరగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. గొప్ప దేశాలైన భారత్, అమెరికా ఈ వివాదాన్ని (సుంకాలు) పరిష్కరించుకుంటాయని బెసెంట్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: టాటా క్యాపిటల్ రోడ్‌షోలు షురూ