
ఎన్‌బీఎఫ్‌సీ దిగ్గజం టాటా క్యాపిటల్ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలను వేగవంతం చేసింది. అంతర్జాతీయంగా ప్రధాన ఫైనాన్షియల్ కేంద్రాలలో ఇన్వెస్టర్ రోడ్‌షోలకు తెరతీసింది. తద్వారా ఈ నెల 22న ప్రారంభంకానున్న ఐపీవోకు దారిని ఏర్పాటు చేసుకుంటోంది. నిజానికి ఆగస్ట్‌లోనే ప్రారంభించిన రోడ్‌షోలకు దేశ, విదేశీ ఇన్వెస్టర్ల నుంచి పటిష్ట ప్రతిస్పందన లభిస్తున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
హాంకాంగ్, సింగపూర్, లండన్, న్యూయార్క్‌సహా దేశీయంగా కీలక నగరాలలో సీనియర్ మేనేజ్‌మెంట్ సమావేశాలను ఏర్పాటు చేస్తోంది. కంపెనీకిగల డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియో, పటిష్ట ఫైనాన్షియల్స్, డిజిటల్ ఫస్ట్ వృద్ధి వ్యూహాలను రోడ్‌షోలలో ప్రదర్శిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు తెలియజేశాయి. ఈ నేపథ్యంలో కంపెనీ విలువ 18 బిలియన్ డాలర్లకు చేరనున్నట్లు అంచనా వేశాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో కంపెనీ ఐపీవోకు దరఖాస్తు చేసినప్పుడు 11 బిలియన్ డాలర్ల విలువను అంచనా వేసిన సంగతి తెలిసిందే.
ఐపీవో వివరాలివీ
ఐపీవోలో భాగంగా టాటా క్యాపిటల్ మొత్తం 47.58 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటిలో 21 కోట్ల షేర్లను తాజాగా జారీ చేయనుంది. మరో 26.58 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు ఆఫర్ చేయనున్నారు. టాటా సన్స్ 23 కోట్ల షేర్లు, ఐఎఫ్‌సీ 3.58 కోట్ల షేర్లు విక్రయానికి ఉంచనున్నాయి. తద్వారా టాటా గ్రూప్ దిగ్గజం 2 బిలియన్ డాలర్లు(రూ. 17,200 కోట్లు) సమీకరించే యోచనలో ఉంది. నెలాఖరు(30)కల్లా కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్‌కానున్నట్లు అంచనా. కంపెనీలో ప్రస్తుతం టాటా సన్స్ వాటా 88.6 శాతంకాగా.. ఐఎఫ్‌సీ 1.8 శాతం వాటా కలిగి ఉంది. ఈక్విటీ జారీ నిధులను భవిష్యత్ పెట్టుబడి అవసరాలకుగాను టైర్–1 మూలధన పటిష్టతకు వినియోగించనుంది. లిస్టింగ్ విజయవంతమైతే దేశీ ఫైనాన్షియల్ రంగంలో అతిపెద్ద ఐపీవోగా రికార్డ్ నెలకొల్పనుంది.
ఇదీ చదవండి: ఒకే కంపెనీలో 25 ఏళ్లు అనుభవం.. తీరా చూస్తే..
2023 నవంబర్‌లో టాటా టెక్నాలజీస్ లిస్టయ్యాక, తిరిగి టాటా గ్రూప్ నుంచి మరో దిగ్గజం ఐపీవోకు రానుండటం ప్రస్తావించదగ్గ అంశం! 2022 సెప్టెంబర్‌లో అప్పర్‌లేయర్ ఎన్‌బీఎఫ్‌సీగా గుర్తింపు పొందిన టాటా క్యాపిటల్ ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం 2025 సెపె్టంబర్‌లోగా ఐపీవో చేపట్టవలసి ఉంది. ఇప్పటికే అప్పర్‌లేయర్ ఎన్‌బీఎఫ్‌సీలు.. హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్(హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సంస్థ), బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(ఏప్రిల్–జూన్)లో కంపెనీ ఆదాయం రూ. 7,692 కోట్లకు చేరగా.. రూ. 1,041 కోట్ల నికర లాభం ఆర్జించింది.