
సెబీకి అప్‌డేటెడ్ ప్రాస్పెక్టస్ దాఖలు
టాటా గ్రూప్ ఎన్‌బీఎఫ్‌సీ దిగ్గజం టాటా క్యాపిటల్ పబ్లిక్ ఇష్యూ బాటలో మరో ముందడుగు వేసింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా అప్‌డేటెడ్ ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. తద్వారా 200 కోట్ల డాలర్లు(రూ.17,200 కోట్లు) సమీకరించే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వెరసి కంపెనీ విలువ 11 బిలియన్ డాలర్లు(రూ.94,600 కోట్లు)గా మదింపు చేశాయి.
ప్రాస్పెక్టస్ ప్రకారం కంపెనీ మొత్తం 47.58 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటిలో 21 కోట్ల షేర్లను కొత్తగా జారీ చేయనుండగా.. 26.58 కోట్ల షేర్లను కంపెనీ ప్రధాన ప్రమోటర్ టాటా సన్స్, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్(ఐఎఫ్‌సీ) ఆఫర్ చేయనున్నాయి. టాటా సన్స్ 23 కోట్ల షేర్లు, ఐఎఫ్‌సీ 3.58 కోట్ల షేర్లు విక్రయించనున్నాయి. ప్రస్తుతం కంపెనీలో టాటా సన్స్ వాటా 88.6 శాతంకాగా.. ఐఎఫ్‌సీకి 1.8 శాతం వాటా ఉంది. ఇష్యూ నిధులను భవిష్యత్ అవసరాలరీత్యా టైర్–1 క్యాపిటల్ పటిష్టతకు వినియోగించనుంది.
ఇదీ చదవండి: ఆస్తిలో అంబానీనే మించిన 20 ఏళ్ల యువకుడు
కంపెనీ ఇప్పటికే ఏప్రిల్‌లో గోప్యతా విధానంలో సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. జులైలో దీనికి అనుమతి లభించడంతో తుది ప్రాస్పెక్టస్ దాఖలు చేసేలోగా అప్‌డేటెడ్ ప్రాస్పెక్టస్ దాఖలు చేయవలసి ఉంది. దీంతో తాజాగా సెబీకి అప్‌డేటెడ్ పత్రాలను దాఖలు చేసింది. వెరసి 2023 నవంబర్‌లో టాటా గ్రూప్ ఐటీ దిగ్గజం టాటా టెక్నాలజీస్ లిస్ట్ అయ్యాక తిరిగి మరో దిగ్గజం పబ్లిక్ ఇష్యూకి రానుంది.