
దసరా, దీపావళి పండుగలు వచ్చాయంటే.. కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు బోనస్‌లు ఇస్తాయి, మరికొన్ని ఊహకందని గిఫ్ట్స్ ఇచ్చి సంతోషపెడుతుంటాయి. ఇలాంటి కోవకు చెందిన కంపెనీలలో ఒకటి.. 'మిట్స్ నేచురా లిమిటెడ్' (Mits Natura Limited). ఈ కంపెనీ బాస్ తన ఉద్యోగులు గత రెండేళ్లుగా కార్లను గిఫ్ట్‌గా ఇస్తున్నారు. ఇప్పుడు మూడోసారి కూడా ఇదే విధానం కొనసాగించారు. ఈసారి ఏకంగా 51 మందికి కార్లను గిఫ్ట్ ఇచ్చారు.
ప్రముఖ ఔషదాల తయారీ సంస్థ.. మిట్స్ నేచురా లిమిటెడ్ కంపెనీ ఫౌండర్ ఎంకే భాటియా ఈ దీపావళికి.. తమ సంస్థలో పనిచేస్తూ ఉత్తమ పనితీరును కనపరిచిన 51 మంది ఉద్యోగులకు కార్లను గిఫ్ట్ ఇస్తూ.. వాటి తాళాలను తానే స్వయంగా అందజేసి.. ప్రతి ఒక్కరినీ అభినందించారు.
ప్రతి సంవత్సరం ఇంత ఖరీదైన కార్లను ఎందుకు బహుమతిగా ఇస్తారని భాటియాను అడిగినప్పుడు.. నా ఉద్యోగులే నా ఫార్మాస్యూటికల్ కంపెనీలకు వెన్నెముక. వారి కృషి, నిజాయితీ, అంకితభావం మా విజయానికి పునాది. వారి ప్రయత్నాలను గుర్తించడం.. వారిని కూడా ఎదిగేలా చేయడం మా విధి అని ఆయన అన్నారు.
కార్లను గిఫ్ట్ ఇవ్వడం అనేది ప్రదర్శించుకోవడానికి కాదు. జట్టులో స్ఫూర్తిని నింపడానికి, సంస్థను ఒక కుటుంబంలా ముందుకు తీసుకెళ్లడానికి అని ఆయన అన్నారు. టీమ్ లేదా ఉద్యోగులు సంతోషంగా ఉన్నప్పుడు.. కంపెనీ తప్పకుండా అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. అయితే ఈ సారి బ్రాండ్ కార్లను గిఫ్ట్ ఇచ్చారు అనే విషయం అధికారికంగా వెలువడలేదు.
ఇదీ చదవండి: తారాస్థాయికి చేరిన బంగారం, వెండి: ధరలు పెరగడానికి కారణాలు!