
బెంగళూరుకు చెందిన ఓ మహిళకు కెనడాలో కారులో మిస్సిస్సాగా నుంచి టొరంటోకు ప్రయాణిస్తున్నప్పుడు వింత అనుభవం ఎదురైంది. తాను ఎక్కిన క్యాబ్ డ్రైవర్‌తో మాటామంతి సాగిస్తుండగా తన ప్రొఫైల్ విని ఆశ్చర్యపోయింది. ఆ డ్రైవర్ తనతో ఏ విషయాలు పంచుకున్నారో రికార్డ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దాంతో అదికాస్తా వైరల్ అయింది.
క్యాబ్ డ్రైవర్ బెంగళూరు మహిళ మేఘనా శ్రీనివాస్‌తో చెప్పిన వివరాల ప్రకారం..‘నేను ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన వ్యక్తిని. గతంలో యూఎస్, కెనడా కోసం మిలిటరీలో వైద్యుడిగా పనిచేశాను. ప్రస్తుతం కెనడాలో పర్మనెంట్ రెసిడెంట్(PR) కోసం ప్రయత్నిస్తున్నాను. నా వైద్య వృత్తిని కొనసాగించడానికి అవసరమైన లైసెన్స్ పొందడానికి ప్రయత్నిస్తున్నాను. ప్రస్తుతం కెనడాలో ఒక డిగ్రీ కోసం చదువుతున్నాను. రోజువారీ ఖర్చుల కోసం ఇలా క్యాబ్ నడుపుతున్నాను. క్యాబ్ నడపడం ద్వారా సుమారు నెలకు 4,000 డాలర్లు సంపాదిస్తున్నాను. కానీ టొరంటోలో ఒక పడకగదికి సుమారు 3,000(రూ.2.63 లక్షలు) డాలర్లు చెల్లించవలసి వస్తుంది. టొరంటోలో అద్దెగదులు చాలా ఖరీదైనవి’
మేఘనా తన పోస్ట్‌లో విదేశాలకు మకాం మార్చే ముందు ప్రజలు జాగ్రత్తగా ఆలోచించి సరైన ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు. కెనడాకు వెళ్లే ముందు విద్యార్థులు, ఇతర వ్యక్తులు క్షుణ్ణంగా అన్ని విషయాలు తెలుసుకోవాలని చెప్పారు. అక్కడి విద్యా వ్యవస్థ లేదా నగరాల గురించి మాత్రమే కాకుండా జీవన ఖర్చులు, విధానాలు, ఉద్యోగ మార్కెట్.. వంటి చాలా అంశాలపై అవగాహన ఏర్పరుచుకోవాలని తెలిపారు.
ఇదీ చదవండి: ధన త్రయోదశి రోజున బంగారంపై పెట్టుబడా?