
ఆమోదం తెలిపిన సెబీ
లిస్టులో లెన్స్‌కార్ట్, వేక్‌ఫిట్, టెనెకో క్లీన్ సంస్థలు
మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మరో ఆరు కంపెనీల పబ్లిక్ ఇష్యూలకు (ఐపీవో) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐవేర్ రిటైల్ సంస్థ లెన్స్‌కార్ట్ సొల్యూషన్స్, వేక్‌ఫిట్ ఇన్నోవేషన్స్, టెనెకో క్లీన్ ఎయిర్ ఇండియా, కార్డీలియా క్రూయిజెస్ నిర్వహణ సంస్థ వాటర్‌వేస్ లీజర్ టూరిజం, కాటన్ యార్న్‌ల తయారీ కంపెనీ శ్రీరామ్ ట్విస్టెక్స్, ఇండ్రస్టియల్ ల్యామినేట్స్ ఉత్పత్తి చేసే లామ్‌టఫ్ ఈ జాబితాలో ఉన్నాయి. ఈ కంపెనీలన్నీ కలిసి సుమారు రూ. 6,500 కోట్లు పైగా సమీకరించవచ్చని అంచనాలు ఉన్నాయి. ఈ ఏడాది జూన్–జూలై మధ్య ఈ ఆరు కంపెనీలు దరఖాస్తు చేసుకోగా, సెపె్టంబర్ 26 – అక్టోబర్ 3 మధ్య అనుమతులు వచ్చినట్లు తెలుస్తోంది. 2025లో 80 కంపెనీలు ఇప్పటికే ఐపీవోల ద్వారా నిధులు సమీకరించుకోగా, ఈ నెలలో మరిన్ని సంస్థలు లైనులో ఉన్నాయి.
లెన్స్‌కార్ట్
తాజాగా షేర్ల జారీ ద్వారా లెన్స్‌కార్ట్ సొల్యూషన్స్ రూ. 2,150 కోట్లు సమీకరించనుంది. ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు 13.22 కోట్ల షేర్లు విక్రయించనున్నారు. ఐపీవో నిధులను కొత్త స్టోర్స్ ఏర్పాటు చేసేందుకు, స్టోర్ల లీజులు–అద్దెలు మొదలైన వాటి చెల్లింపులకు, టెక్నాలజీ–క్లౌడ్ ఇన్‌ఫ్రాపై ఇన్వెస్ట్ చేసేందుకు, బ్రాండ్ మార్కెటింగ్‌కు, ఇతర సంస్థ కొనుగోలుకు, ఇతరత్రా సాధారణ కార్పొరేట్ అవసరాలకు కంపెనీ వినియోగించుకోనుంది.
వేక్‌ఫిట్ ఇన్నోవేషన్స్
రూ. 468.2 కోట్ల వరకు విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేయనుంది. ఆఫర్ ఫర్ సేల్
(ఓఎఫ్‌ఎస్) కింద ప్రస్తుత వాటాదారులు 5.84 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. ఫ్రెష్ ఇష్యూ ద్వారా వచ్చే నిధుల్లో రూ. 82 కోట్లను 117 కంపెనీ ఆపరేటెడ్ కంపెనీ ఓన్డ్ (కోకో)–రెగ్యులర్ స్టోర్స్, ఒక కోకో–జంబో స్టోర్ ఏర్పాటుకు; కొత్త పరికరాల కొనుగోలుకు రూ. 15.4 కోట్లు; ప్రస్తుత స్టోర్ల లీజులు, అద్దెల కోసం రూ. 145 కోట్లు; మార్కెటింగ్ కోసం రూ. 108 కోట్లను కంపెనీ వినియోగించుకోనుంది.
టెనెకో క్లీన్ ఎయిర్ ఇండియా
ఇష్యూ ద్వారా రూ. 3,000 కోట్లు సమీకరించనుంది. ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) విధానంలో ఉంటుంది. ప్రమోటర్ టెనెకో మారిషస్ హోల్డింగ్స్ ఈ షేర్లను విక్రయించనుంది.
వాటర్‌వేస్ లీజర్ టూరిజం
కొత్తగా షేర్లను జారీ చేయడం ద్వారా రూ.727 కోట్లు సమీకరించనుంది. ఇందులో రూ. 552.53 కోట్లను తమ అనుబంధ సంస్థ బేక్రూయిజ్ షిప్పింగ్ అండ్ లీజింగ్‌కి సంబంధించిన అడ్వాన్స్‌లు, లీజులు మొదలైన వాటిని చెల్లించేందుకు, మిగతా మొత్తాన్ని కార్పొరేట్ అవసరాలకు కంపెనీ ఉపయోగించుకోనుంది.
శ్రీరామ్ ట్విస్టెక్స్
1.06 కోట్ల షేర్లను కొత్తగా జారీ చేయనుంది. ఈ నిధులను సొంత అవసరాల కోసం 6.1 మెగావాట్ల సౌరవిద్యుత్ ప్లాంటు, 4.2 మెగావాట్ల పవన విద్యుత్ ప్లాంటు ఏర్పాటు కోసం; అలాగే రుణాల చెల్లింపు, ఇతరత్రా నిర్వహణ మూలధన అవసరాల కోసం వినియోగించుకోనుంది.
లామ్‌టఫ్
కొత్తగా 1 కోటి షేర్లను జారీ చేయనుండగా, ప్రమోటర్లు 20 లక్షల షేర్లను ఓఎఫ్‌ఎస్ కింద విక్రయించనున్నారు. తెలంగాణలో తమకున్న తయారీ ప్లాంటు విస్తరణకు, నిర్వహణ మూలధనం, ఇతరత్రా కార్పొరేట్ అవసరాల కోసం నిధులను కంపెనీ ఉపయోగించుకుంటుంది.
ఇదీ చదవండి: దేశం విడిచిన కుబేరులు.. కారణాలు..